Jagan Mohan Reddy: జ‌గ‌న్ రాజీనామా.. భార‌తికి ప‌గ్గాలు?

Jagan Mohan Reddy to resign as mla

Jagan Mohan Reddy:  మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రిస్థితి ఇప్పుడు అగమ్య‌ గోచ‌రంగా ఉంది. సిద్ధం సిద్ధం మ‌ళ్లీ గెలుస్తాం.. సీఎంగా త‌న ప్ర‌మాణ స్వీకారం వైజాగ్‌లోనే అని తెగ శ‌ప‌థాలు చేసిన జ‌గ‌న్.. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల‌తో ప్ర‌తిప‌క్ష హోదాను కూడా కోల్పోయారు. స‌రే.. రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మే. ఈ ఐదేళ్లు ప్ర‌జ‌ల త‌మ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని మ‌ళ్లీ అధికారంలోకి వ‌ద్దాం అని పార్టీ నేత‌ల‌తో చెప్పారు జ‌గ‌న్.

ఇక్క‌డ మ‌రో విషయం ఏంటంటే.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే ముందుగా ఫోక‌స్ చేసేది జ‌గన్‌కు సంబంధించిన కేసులపైనే. ఆల్రెడీ ఈ నెల‌లోనే జ‌గ‌న్ సీబీఐ కేసులకు సంబంధించి మ‌ళ్లీ విచార‌ణ మొద‌లుకానుంది. అక్ర‌మ ఆస్తుల కేసులో బెయిల్ ర‌ద్దు కూడా అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఒక‌వేళ జ‌గ‌న్ జైలుకి వెళ్తే పార్టీ ప‌రిస్థితి ఏంటి అనే చ‌ర్చ పార్టీ నేత‌ల్లో ఆల్రెడీ మొద‌లైపోయింది.

జ‌గ‌న్ రాజీనామా చేస్తారా?

గ‌తంలో జ‌గ‌న్ జైలు పాలైన‌ప్పుడు పార్టీని త‌న కంట్రోల్‌లో పెట్టుకుని నేత‌ల్లో ధైర్యాన్ని నింపుతూ ముందుకు న‌డిపించింది ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిళ‌. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ జైలుకి వెళ్తే పార్టీని మునుప‌టిలా న‌డిపేందుకు ష‌ర్మిళ కూడా లేదు. త‌ల్లి విజ‌య‌మ్మ కూడా త‌న మ‌ద్దతు ష‌ర్మిళ‌కే అని చెప్ప‌క‌నే చెప్పారు. మ‌రి పార్టీ ప‌గ్గాలు ఎవ‌రికి వెళ్తాయి అంటే.. క‌చ్చితంగా జ‌గ‌న్ భార్య భార‌తి రెడ్డికే ఇవ్వాల్సి వ‌స్తుంది. జ‌గ‌న్ త‌న ఇంట్లో వారికి కాకుండా పార్టీలోని ఏ సీనియ‌ర్ నేత‌కు ప‌గ్గాలు ఇవ్వాల‌ని చూసినా ఇత‌ర నేత‌లు ఒప్పుకునే ప‌రిస్థితి లేదు.

పోనీ భార‌తి రెడ్డికి పార్టీ ప‌గ్గాలు ఇవ్వాలంటే ఆమె మాట పార్టీలో వినేవారు త‌క్కువ మందే ఉన్నారు. ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలిచి భార‌తి రెడ్డి పార్టీ ప‌గ్గాలు చేప‌డితే బ‌హుశా ఆమె మాట వినే ఆస్కారం ఉంది. కానీ ఇప్పుడు భార‌తి ఏ ప‌ద‌విలో గెల‌వల‌న్నా ఉప ఎన్నిక జ‌ర‌గాలి. ఇప్పుడు ఉప ఎన్నిక జ‌రిగే ప‌రిస్థితి లేదు. కాబ‌ట్టి జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి పులివెందుల‌లో ఉప ఎన్నిక జ‌రిగేలా చేసి త‌న స్థానంలో భార‌తిని నిల‌బెట్టి గెలిపించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చ‌ర్చ‌లు జరుగుతున్నాయి.