భానుడి భగభగలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు
రానున్న నాలుగైదు రోజుల్లో ఎండల తీవ్రత భారీ పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటి వరకు వర్షాలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో దాదాపు అయిదు రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ప్రజలు బయటకురావొద్దని తెలిపింది. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతోపాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతం మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయని చెప్పింది. మరోవైపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా భూతాపం పెరిగిపోతుందని.. దీర్ఘకాలంలో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో భారత్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 1901 తర్వాత ఇంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాల మీదుగా వీచిన గాలుల మూలంగా మార్చి నెలలో భారత్లోని వివిధ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైందని. దీంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు అదుపులోకి వచ్చాయని వివరించింది. ఇక రాగల అయిదు రోజుల్లో బిహార్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, వేడిగాలుల తీవ్రత అధికంగా ఉండొచ్చని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. మరోవైపు.. మధ్య, తూర్పు భారతదేశంలోనూ వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెద్దగా పెరిగే అవకాశం లేదని వాతవరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో మాత్రం కొంత మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నాలుగు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో పెరుగుదల ఉంటుందని, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. పలు జిల్లాలకు ప్రత్యేకంగా సూచనలు జారీ చేసింది. సోమవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, 11న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, 12, 13 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించింది.
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. సోమవారం 27, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఏఎ్సఆర్ జిల్లాలో 7, మన్యంలో 6, కాకినాడలో 6, అనకాపల్లి 5, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ సూచించారు.