IPAC కాదు I PACK..!
Jagan: 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఎలా గెలిచాడా అని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే.. ఒక్కసారి ఒక్కసారి అంటూ ప్రజలను నమ్మించడమే. ఇన్నాళ్లూ చంద్రబాబు నాయుడు పాలన చూసాం.. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు వచ్చాడు కాబట్టి ఆయన పాలన ఎలా ఉంటుందో కూడా ఒకసారి చూసేద్దాం అని ఓట్లు గుద్దేసారు. అలా ట్రయల్ వేసినట్లు జగన్ అధికారంలోకి వచ్చాడని అనిపిస్తోంది ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు చూస్తుంటే.
అధికారంలోకి వచ్చాక తెలుగు దేశం పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు జగన్. ప్రజలకు ఉచితంగా అది ఇచ్చేస్తా ఇది ఇచ్చేస్తా అని చెప్పి చివరికి చిప్ప చేతిలో పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేసి.. మూడు రాజధానులు ఉంటే బాగుంటుంది అంటూ డొల్ల కబుర్లు చెప్పి.. కంపెనీలు తీసుకురాకుండా.. యువతకు ఉద్యోగాలు లేకుండా చేసిన జగన్ వై నాట్ 175 అని ఎలా అన్నారో ఆయనకే తెలియాలి.
జగన్ అండ చూసుకుని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు విర్రవీగారు. అసలు వీళ్లు ఎమ్మెల్యేలు ఏంట్రా అనే విధంగా నీచపు రాజకీయాలు చేసారు. గెలిచేసాం కాబట్టి మళ్లీ ఐదేళ్ల తర్వాత ప్రజల ముందుకెళ్లి కన్నీరుపెట్టుకుంటే వాళ్లే ఓట్లు వేసేస్తారు అనుకున్నారేమో..! ప్రజలు అమాయకులే కానీ రాజకీయ నేతల చరిత్రలు ఎరగనివారు మాత్రం కారు. అందుకే ప్రచారాల్లో, సభల్లో పాల్గొన్నట్లే పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్‌కు గడ్డి పెట్టి ఇంటికి పంపించారు.
ముఖ్యమంత్రి అంటే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలి. కేవలం తన చుట్టూ ఉన్న నలుగురు కీలక నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటూ ఇతర ఎమ్మెల్యేలను కూడా తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలికి రానివ్వని జగన్.. ప్రజల మధ్య పరదాలు కట్టుకుని తిరిగితే మళ్లీ అధికారం కట్టబెడతారని ఎలా అనుకున్నారు? ఏనాడూ ఓ ప్రజా దర్బార్ పెట్టింది లేదు. ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది లేదు. ఎన్నికల సమయంలో మాత్రం సిద్ధం సిద్ధం అంటూ తెగ యాత్రలు చేసారు. యాత్రలు చేసినంత మాత్రాన ప్రజలు ఐదేళ్ల రాక్షస పాలనను మర్చిపోతారని అనుకుంటే ఎలా? ఈరోజు వెలువడుతున్న ఫలితాలు చూస్తుంటే ఆ నాడు వైఎస్సార్ కాంగ్రెస్‌కు 151 సీట్లు ఎలా వచ్చాయబ్బా అనే సందేహం కలగకుండా పోదు.
ఐప్యాక్ టీంని నమ్ముకుని..
2019లో ఐప్యాక్ టీం వల్లే గెలిచేసాం అనుకున్నారు జగన్. అందులో ఎంత నిజం ఉందో తెలీదు కానీ ఈసారి కూడా ఐప్యాక్ టీంకు కోట్లల్లో డబ్బులు అప్పగించి ఎలాగైనా గెలిచేలా సన్నాహాలు చేసారు. పోలింగ్ పూర్తయినప్పుడు కూడా తన ఐప్యాక్ టీంని కలిసి సంతృప్తికరంగా ఉందని.. రెండోసారి కూడా గెలుపు తనదే అని చెప్పడం కొసమెరుపు. ఇప్పుడు IPAC కాదు కదా I PACK అనేలా ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పారు.