పవన్ కళ్యాణ్.. ది ఇంపాక్ట్ ప్లేయర్..!
Pawan Kalyan: క్రికెట్ మ్యాచ్‌లో ఓ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నట్లే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు. అతనెవరో కాదు.. పవన్ కళ్యాణ్. ఇంపాక్ట్ ప్లేయర్… కింగ్ మేకర్.. ఇలా ఆయనకు ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే.
2019 ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగు దేశం పార్టీని.. ఆ పార్టీ అధినేతను నేనున్నాను అంటూ చేయందించి.. పొత్తు పెట్టుకోవడమే కాకుండా.. పొత్తులోకి నేను కలవను మొర్రో అని కూర్చున్న భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి మరీ కూటమిని ఏర్పాటుచేసింది పవనే. చంద్రబాబు నాయుడు బ్యాక్‌డోర్ పాలిటిక్స్ తెలిసి భారతీయ జనతా పార్టీ ఆయనకు దూరంగా ఉండాలని అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ ఈసారి అలా జరగదు సర్ అని కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను ఒప్పించి మరీ కూటమి ఏర్పాటయ్యేలా ఎంతో కషపడ్డారు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 150కి పైగా సీట్లలో ఆధిక్యంతో దూసుకుపోతోంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఊపుతెచ్చిన హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదం
పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాల్లో హలో ఏపీ.. బైబై వైసీపీ అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. ఇది ప్రజలకు బాగా నచ్చినట్లుంది. పవన్ లెక్కలు అన్నీ అర్థమైనట్లున్నాయ్. లేకపోతే.. జనసేనకు ఇచ్చిందే 21 సీట్లు అంటే మళ్లీ 21 సీట్లలో ముందంజలో ఉండటం ఏంటి? ఇది నిజంగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త ప్రభంజనం అనే చెప్పాలి.
ఓడిపోతే నాకేం పోతుంది.. మీరే నష్టపోతారు
పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ఆయనకు కలిసొచ్చిన అంశంగా చెప్పుకోవాలి. ఈసారి ఎన్నికల్లో నేను ఓడిపోతే మళ్లీ ఐదేళ్ల తర్వాత పోటీ చేస్తాను. నా సినిమాలు నేను చేసుకుంటూ ఉంటాను. నాకు పోయేదేమీ లేదు. కానీ ఈ ఐదేళ్లలో మీ వయసు పెరిగిపోయి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈసారి జాగ్రత్తగా ఆలోచించి వేయండి అని ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజెప్పారు. తెలుగు దేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై మక్కువ, నమ్మకం పెరిగినట్లు కనిపిస్తోంది. అలా అందరినీ కలుపుకుని పోయి జగన్‌ను గద్దెదించిన ది ఇంపాక్ట్ ప్లేయర్ పవన్‌కు ఎన్నికల్లో గెలిచినందుకు అభినందనలు తెలుపుదాం.