Pushpa 2: అక్కడ వ్యూస్‌తో దూసుకుపోతున్న టీజర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 టీజర్ వచ్చేసింది. బన్ని బర్త్ డే సందర్భంగా ఈ టీజర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అయిదు భాషల్లో విడుదలైన ఈ టీజర్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. మూడు నిమిషాలు టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. బన్నీ టాలీవుడ్ హీరో, అంటే తెలుగు టీజర్‌కి ఎక్కువ వ్యూస్ రావాలి. కానీ తెలుగు కంటే ఎక్కువగా వేరే భాషలో వ్యూస్ సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి బన్నీకి తెలుగు తర్వాత కేరళలో ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. అంటే మలయాళంలో అయినా ఎక్కువ వ్యూస్ రావాలి. కానీ ఈ రెండు భాషల్లో కాకుండా హిందీలో ఎక్కువ వ్యూస్ సాధించి బన్నీ బాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. తెలుగులో ఇప్పటి వరకు ఈ టీజర్ కి 22 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీలో ఏకంగా 35 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. వీటి తరువాత తమిళంలో 3.8 మిలియన్, మలయాళంలో 1.6 మిలియన్, కన్నడలో 1.1 మిలియన్ వ్యూస్ అందుకుంది. ఈ వ్యూస్ బట్టి చూస్తుంటే పుష్పకి సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉన్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేయడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా నేడు (ఏప్రిల్ 7) హీరోకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. ప్రేక్షకుల అంచనాలు మించి టీజర్ ఉండడంతో పుష్ప ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
ఇది ఇలా ఉంటే, టీజర్ తో పాటు మరో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ కాళీ మాత గెటప్ లో కనిపిస్తున్నాడు. చీర కట్టుకొని, చేతికి గాజులు, ఒంటి పై బంగారంతో చేతిలో గన్ పట్టుకొని ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. ఇక పోస్టర్ చూసిన ప్రేక్షకులు అరాచకం అంటున్నారు. సినిమా పై, నటన పై తనకి ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అమ్మోరు అవతారంలో ఉన్న బన్ని గెటప్ వెనుక చాలా కథ ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది. కాంతార సినిమాలోలానే ఇది కూడా ఓ ఆదివాసీ దేవత అవతారం అంటూ రకరకాల కథలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే టీజర్ లోని ఒక డైలాగ్ కూడా ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సెకండ్ పార్ట్ లో పుష్ప బిజినెస్ ని చైనా, జపాన్, మలేషియా వరకు విస్తరించినట్లు చూపించబోతున్నారు.
పుష్ప: ది రైజ్‌లో తన మ్యానరిజం, డైలాగ్స్, డాన్సులతో పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్‌నే ఆకట్టుకున్నాడు బన్నీ. ఇప్పుడు రెండో భాగం టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అంతకంటే ఎక్కువే సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. కాగా మొదటి భాగంలో సునీల్, అజయ్ ఘోష్ విలన్స్ గా కనిపించగా రెండో భాగంలో ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.