‘బలగం’ను దాటేసిన ‘రంగమార్తాండ’!

ఈమధ్య కాలంలో యాక్షన్​ సినిమాలకంటే వాస్తవిక సంఘటన ఆధారంగా, ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ రూపొందిన సినిమాలే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ తరహా సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సినిమా ‘బలగం’. కమెడియన్​ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించారు. తెలంగాణ సంప్రదాయాన్ని వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించినందుకుగాను డైరెక్టర్ వేణుని తెలుగు ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులూ అభినందిస్తున్నారు. ఈ సినిమా అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ మంచి విజయం అందుకుంది. కొన్ని గ్రామాల్లో అయితే ఏకంగా తెరలపై ఈ సినిమాను ప్రదర్శించి ఊరంతా కూర్చుని వీక్షిస్తూ తమ బంధాలు, బంధుత్వాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఇక, ఇదే తరహాలో ఇటీవల విడుదలైన చిత్రం ‘రంగమార్తాండ’. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ వంటి నటీనటులు, లెజెండరీ డైరెక్టర్​ కృష్ణ వంశీ టేకింగ్​ ఈ సినిమాకి వసూళ్లు రప్పించడంలో ఏమాత్రం సహాయపడలేదు. అయితే ఈ చిత్రాన్ని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లలో మెప్పించలేకపోయినా ఓటీటీలో మాత్రం రెస్పాన్స్ అదిరిపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కుతోంది. మరాఠి లో సూపర్ హిట్ గా నిల్చిన ‘నట సామ్రాట్’చిత్రానికి తెలుగు రీమేక్​గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , బ్రహ్మానందం, రమ్య కృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. అయితే సినిమాను సరైన పద్ధతిలో ప్రమోషన్​ చేయకపోవడం వల్లే ఈ సినిమా మంచి కలెక్షన్లను అందుకోలేకపోయిందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. థియేటర్లలో ఆదరణ దక్కకపోయినా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో కేవలం 24 గంటల్లోనే మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయట. మొదటి రోజు బలగం చిత్రానికి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదని అంటున్నారు విశ్లేషకులు. ఓటీటీలో అయినా ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు సంతోషిస్తున్నారు మేకర్స్​. మొదటిరోజే రికార్డు వ్యూస్​ సొంతం చేసుకున్న ఈ సినిమా రానున్న రోజుల్లో ఎన్ని రికార్డులు క్రియేట్​ చేస్తుందో చూడాలి మరి.