Summer: తాటి ముంజలు తింటున్నారా?

వేసవి తాపాన్ని తగ్గించడానికి తాటి ముంజలు మంచి ఔషధం. ప్రకృతి అందించిన అమృత ఫలాల్లో తాటి ముంజలు కూడా ఒకటి. మంచుగడ్డల్లా తెల్లగా మెరుస్తూ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉండే తాటి ముంజలను వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఇష్టంగా తింటారు. వేసవి వచ్చిందంటే పల్లె, పట్టణం తేడా లేకుండా వీటికి ఉండే ఆదరణ అంతా ఇంతా కాదు. ఎండాకాలంలో మాత్రమే లభించే వీటిని ఐస్ యాపిల్స్ అని కూడా పిలుస్తారు. అంటే యాపిల్స్​లో ఉండే వాటికి సమంగా వీటిలోనూ విలువైన పోషకాలు ఉంటాయన్నమాట. వేసవిలో ఈ తాటి ముంజలను తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం..

తాటి ముంజల్లో విటమిన్‌ బి, ఐరన్‌, కాల్షియం, సి,ఎ.విటమిన్లు, జింకు పాస్పరస్‌, పొటాషియం, ధయామిన్‌, రిబో ప్లేవిస్‌, నియాసిస్‌ వంటి బీ కాంప్లెక్స్‌ వంటి అనేక పోషకాలు ఉంటాయి. మూడు తాటి ముంజలు ఒక కొబ్బరి బొండంతో సమానమని నిపుణులు చెప్పుతున్నారు.
* అరటిపండులో ఉండే పొటాషియానికి సమానంగా తాటిముంజలలో పొటాషియం ఉంటుంది. అందువల్ల తాటి ముంజలను తినటం వలన రక్త సరఫరా మెరుగుపడి రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
*ఎండాకాలంలో మ‌న శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. ఈ క్ర‌మంలో డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అయితే అలాంటి పరిస్థితిలో తాటి ముంజ‌ల‌ను తింటే శ‌రీరంలోకి ద్ర‌వాలు వ‌చ్చి చేర‌తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి బయట పడవచ్చు. జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి సమస్యలు తొలగిపోయి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
* మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా ముంజలను తినవచ్చు. తాటి ముంజ‌ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది. వేస‌విలో ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు అవుతున్న సమయంలో ముంజలను తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
* లేత తాటిముంజల్ని తీసుకుని గుజ్జులా చేసి అందులో కొద్దిగా పాలపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. తాటి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండుట వలన శరీరానికి తగినంత తేమను అందించి, చర్మాన్ని, శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలా బాగా సహాయపడుతుంది.
* ఈ తాటి ముంజలతో పలు రకాల స్వీట్లు, వంటలు కూడా చేసుకుని తింటారు. ఏ విధంగా తిన్నా వీటిలోని పోషకాలు శరీరానికి సంపూర్ణంగా అందుతాయనేది నిపుణుల సూచన. వేసవిలో తప్పకుండా తినాలని నిపుణులు సూచించే ఆహారపదార్థాలలో వీటిని ప్రధానంగా పేర్కొంటారు. మరెందుకు ఆలస్యం.. మీరూ తినేసి పోషకాలను పొందండి.