అకీరా నా కొడుకు.. పవన్ ఫ్యాన్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రేణూ దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల విడిపోయిన సంగతి తెలిసిందే. వీరి పుట్టిన అకీరా, ఆద్యలను రేణూనే చూసుకుంటున్నారు. అప్పుడప్పుడు పవన్ తన పిల్లలను కలుస్తుంటారు. అయితే రేణూ అన్నీ మర్చిపోయిన తన పిల్లలతో సంతోషకరమైన జీవితం జీవిస్తున్నప్పటికీ.. కొందరు అభిమానులు ఆమెకు ఆగ్రహం తెప్పించేలా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు వదినా వదినా అంటూ రేణూకు పవన్ గురించి మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తూ వేధించేవారు. వారికి ఎప్పటికప్పుడు రేణూ గట్టిగా బుద్ధిచెప్తుండేవారు. తాజాగా.. రేణూకి ఇలాంటి అనుభవమే మళ్లీ ఎదురైంది.
నిన్న అకీరా నందన్ 19వ బర్త్‌డే కావడంతో రేణూ.. తన కుమారుడి ఒడిలో కూర్చోపెట్టుకున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసారు. అయితే పవన్ అభిమాని అయిన ఓ నెటిజన్ రేణూకు ఇన్‌స్టా కామెంట్ సెక్షన్లో ఓ మెసేజ్ పెట్టాడు. “మేడం.. ఇది చాలా అన్యాయం. అకీరాను ఒక్కసారైనా చూపించండి. మా అన్నయ్య కొడుకుని చూడాలని ఉంటుంది. అప్పుడప్పుడు మీరు అకీరా వీడియోలను కూడా షేర్ చేస్తుండండి” అని కామెంట్ చేసాడు. ఇందుకు రేణూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. “అన్నయ్య కొడుకా? అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు పవన్‌కి వీరాభిమానులు అన్న విషయం నాకు తెలుసు. కానీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడండి. ఇలాంటివి నేను మామూలుగా పట్టించుకోను కానీ కొన్నిసార్లు మీరు హద్దులు దాటుతుంటే చూస్తూ ఊరుకోలేను” అని రిప్లై ఇచ్చారు.
ఈ సంభాషణ ఇంతటితో ఆగలేదు. మరో అభిమాని మధ్యలో కలగజేసుకుని.. “మన దేశంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పమంటే ముందు తండ్రి పేరే చెప్తారు. అది మన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని మర్చిపోయి ఇలా కోపం తెచ్చుకోకండి” అని ఉచిత సలహా ఇచ్చాడు. దీనికి కూడా రేణూ రిప్లై ఇచ్చారు. “ఓ తల్లిని తక్కువ చేసి మాట్లాడటం అనేది మన సంప్రదాయమా? మన దేశంలో తల్లిని దైవంతో సమానంగా చూస్తారు. మీకు తెలీకపోతే మీ అమ్మని, ఆంటీలను అడుగు” అని గట్టిగా సమాధానం ఇచ్చారు.
మధ్యలో మరో అభిమాని కలగజేసుకుని. “మరి ఎందుకు అప్పుడప్పుడు మీరు అకీరాను పవన్ ఇంటికి పంపుతుంటారు” అని అడిగాడు. ఇలాంటి అర్థంలేని ప్రశ్నలతో విసిగిపోయిన రేణూ అందరినీ హెచ్చరిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. “11 ఏళ్లుగా నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంకా నోరుమూసుకుని కూర్చోవాలంటే నా వల్ల కాదు. దయచేసి నా పోస్ట్‌లకు మీరు కామెంట్లు పెట్టకండి. నేను మీ పోస్ట్‌లపై కామెంట్లు పెట్టడంలేదు కదా.. దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి” అంటూ ఆసహనం వ్యక్తం చేసారు రేణూ.