ఇంటర్వ్యూలకు తల్లిదండ్రులకు తీసుకెళ్లచ్చా?
Lifestyle: స్కూల్లో లేదా కాలేజ్‌లో అడ్మిషన్ కోసం తల్లిదండ్రులను తీసుకెళ్లడం వరకు ఓకే. ఉద్యోగానికి సంబంధించిన ఇంటర్వ్యూలకు తల్లిదండ్రులను తీసుకెళ్లడం ఏంటి సిల్లీగా అనుకుంటున్నారా? ఇది జెన్ జీ (1997 నుంచి 2011 మధ్యలో పుట్టినవారు) ఫాలో అవుతున్న ట్రెండ్.
ఇంటెలిజెంట్ అనే ఆన్లైన్ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ విషయం తేలిందట. ఇప్పుడు కంపెనీలు ఫ్రెషర్లను అస్సలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆల్రెడీ ఆఫీస్‌కి వచ్చి పనిచేస్తున్నవారికే ఎక్కువ జీతం, ఎక్కువ బాధ్యతలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. దాదాపు 800 మంది రిక్రూటర్లతో ఈ సర్వే చేయగా.. వారిలోని ప్రతి ఐదుగురిలో ఒకరు ఇంట్రెస్టింగ్ అంశాన్ని వెల్లడించారు. అదేంటంటే.. ఇప్పుడిప్పుడే కాలేజ్ పూర్తయ్యి ఇంటర్వ్యూలకు వస్తున్నవారు తమ తల్లిదండ్రులను వెంటబెట్టుకొస్తున్నారట.
మరో విషయం ఏంటంటే.. కాలేజ్ అయిపోయాక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వస్తున్న అభ్యర్ధులు కనీసం ప్రశ్నలు అడుగుతున్న వారి కళ్లల్లోకి సూటిగా చూసి కాన్ఫిడెంట్‌గా సమాధానాలు కూడా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు.. వారి అర్హతకు తగ్గట్టు సాలరీలు అడగకుండా అత్యధికంగా జీతాలు కావాలని డిమాండ్ చేస్తున్నారట. ఇంటర్వ్యూలకు వచ్చే ముందు నీట్‌గా దుస్తులు వేసుకోకుండా ఏదో ఫ్యాషన్ షోకి వెళ్తున్నట్లు వేసుకొస్తున్నారని సర్వేలో తేలింది.