రూ.18 వేల కోట్ల కంపెనీని కేవలం రూ.74కే అమ్మేసిన వ్యాపారవేత్త
BR Shetty: వేల కోట్ల కంపెనీని స్థాపించి కొన్ని కారణాల వల్ల నష్టపోయిన వారి గురించి ఎన్నో కథలు విన్నాం. కంపెనీని నడపలేక వేల కోట్లకు కానీ వందల కోట్లకు కానీ అమ్ముకున్నవాళ్ల గురించీ విన్నాం. కానీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.18 వేల కోట్ల కంపెనీని కేవలం 74 రూపాయలకే అమ్మేసిన వ్యక్తి గురించి విన్నారా? అతనే బీఆర్ శెట్టి. అసలు ఇతని కథేంటో.. అన్ని వేల కోట్ల రూపాయలని 74 రూపాయలకే ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే బిఆర్ శెట్టి. పూర్తి పేరు బవగుతు రఘురామ్ శెట్టి. కర్ణాటకలోని ఉడుపి ప్రాంతానికి చెందిన శెట్టి మణిపాల్‌లో ఫార్మాసూటికల్స్ చదివాడు. ఉడుపిలోని మున్సిపల్ కౌన్సిల్‌కి వైస్ ఛైర్మన్‌గానూ పనిచేసారు. ఇతను చంద్రకుమారి శెట్టి అనే మహిళను పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత మంచి అవకాశాల కోసం 1973లో చేతిలో రూ.600తో అబు దాబి వెళ్లాడు.
ఓ ఫార్మాసూటికల్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసాడు. 1975లో సొంతంగా న్యూ మెడికల్ సెంటర్ పేరుతో ఫార్మాసూటికల్ క్లీనిక్‌ను పెట్టాడు. ఈ క్లీనిక్‌లో అతని భార్య మాత్రమే వైద్యురాలిగా పనిచేసేవారు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే న్యూ మెడికల్ సెంటర్ అబు దాబిలోనే అతిపెద్ద ఫార్మాసూటికల్ కంపెనీగా ఎదిగింది. 2019లో శెట్టి అత్యంత సంపన్నుల జాబితాలో 45వ స్థానంలో ఉన్నారు. 2019 నాటికి ఆయన కంపెనీ ఆస్తుల విలువ రూ.18 వేల కోట్లు. బుర్జ్ ఖలీఫాలో కొన్ని భవాలను కొనేసారు. ఎన్నో లగ్జరీ కార్లు ఆయన దగ్గర ఉండేవి.
కానీ అప్పుడే శెట్టి పతనం కూడా మొదలైంది. 2019లో మడ్డీ వాటర్స్ అనే యూకేకి చెందిన రీసెర్చ్ కంపెనీ శెట్టి కంపెనీ చేసిన మోసాలను బయటపెట్టింది. న్యూ మెడికల్ క్లీనిక్ కంపెనీకి అప్పులు తక్కువగా ఉన్నాయని.. కానీ లాభాలు మాత్రం కోట్లల్లో ఉన్నాయని అబు దాబి ప్రభుత్వాన్ని, పెట్టుబడిదారులను నమ్మించాడు. అవన్నీ అబద్ధాలే అని మడ్డీ వాటర్స్ సంస్థ రుజువులతో సహా బయటపెట్టడంతో కంపెనీ మార్కెట్ వ్యాల్యూ పడిపోయింది. దాంతో ఆ కంపెనీ పీకల్లోతు నష్టాల్లో పేరుకుపోయింది. దాంతో రూ.74కే తన వేల కోట్ల కంపెనీని అబు దాబి ప్రభుత్వానికి అమ్మేసాడు.