Birthday Special: అఖిల్ అక్కినేని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ఏడాది నిండకుండానే తన బోసి నవ్వుతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ‘సిసింద్రీ’ అఖిల్ అక్కినేని. నడవడం, మాట్లాడటం రాని వయసులోనే సినిమాలో నటించి అక్కినేని నాగేశ్వరావు వారసుడు అనిపించుకున్నాడు అఖిల్. బోసి నవ్వులు, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల మనసులో ‘సిసింద్రీ’గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1994, ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్కినేని నాగార్జున, అమల దంపతులకు జన్మించారు అఖిల్. తన పుట్టినరోజు సందర్భంగా అఖిల్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు మీకోసం..
తండ్రి నాగార్జున ద్వారా తెలుగు భాషను నేర్చుకున్న అఖిల్, తల్లి అమల నుంచి బెంగాలీ, ఐరిష్ భాషలను నేర్చుకున్నారు. నిజానికి అఖిల్ కడుపులో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ పరీక్షలో పుట్టబోయేది అమ్మాయి అని తేలిందట. అయితే అమలకు డెలివరీలో మగ బిడ్డ పుట్టాడట. అంటే అఖిల్‌ను జెండర్ టెస్ట్ లో అమ్మాయి అని తప్పుగా నిర్ధారించారట. అంతేకాదు, అమ్మాయి అని తెలుసుకున్న తర్వాత ఇండియాకు తిరుగు ప్రయాణం కావడానికి తీసుకునే టికెట్లో నిఖిత అనే పేరు రాశారట నాగార్జున, అమల. అబ్బాయి పుట్టేసరికి ఆశ్చర్యపోయారు.అయితే, డెలివరీకి రెండు రోజుల ముందు తమకు పుట్టేది అబ్బాయేనని అనిపిస్తోందని నాగార్జునకు అమల చెప్పారట. అదే నిజమైందంటూ ఈ విషయాన్ని అమలనే స్వయంగా ఓ సందర్భంలో పంచుకున్నారు.
అఖిల్‌కు ఇండియన్ సిటిజన్ షిప్‌తోపాటు అమెరికా సిటిజన్ షిప్ కూడా ఉంది. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సిటీలో అఖిల్ జన్మించారు. దీంతో ఆయనకు రెండు దేశాల పౌరసత్వాలు లభించాయి. అమల గర్భవతిగా ఉన్న సమయంలో ఆమెతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా అమెరికా వెళ్లారు.
సిసింద్రీ సినిమాను తెరకెక్కించే నేపథ్యంలో అఖిల్‌ను నటింపజేయాలని అమలను దర్శకుడు శివ నాగేశ్వరరావు అడిగారట. దానికి అమల కుదరదని చెప్పేశారట. అంత చిన్న వయసులో నటించడం ఏమిటి అని అన్నారట. అయితే, అమలను నాగార్జున ఒప్పించారట. అఖిల్ నటించే సిసింద్రీ సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని మాట ఇచ్చారట. అంతేకాదు, ఆ సినిమాకు వచ్చిన లాభాలను హైదరాబాద్ బ్లూ క్రాస్కే ఇస్తానని చెప్పడంతో అమల ఒప్పుకున్నారు.
చిన్నప్పటి నుంచి అఖిల్‌కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందులోనూ క్రికెట్ అంటే మరీ. క్రికెట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఆస్ట్రేలియా స్కూల్లో జాయిన్ కావడం కోసం తల్లిదండ్రులైన నాగార్జున, అమలను చాలా కష్టపడి ఒప్పించారు అఖిల్. బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో బీబీఏ లో డిగ్రీ పొందారు అఖిల్. అనంతరం న్యూయార్క్ ఫిలిం ఇనిస్టిట్యూట్, లీ స్ట్రాస్ బర్గ్ లో యాక్టింగ్ శిక్షణ కోసం 16 ఏళ్ల వయసులోనే తన పేరు నమోదు చేసుకున్నారు.
స్పోర్ట్స్ పైన అఖిల్‌కు ఉన్న ఆసక్తితోనే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కొన్నేళ్లుగా యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇక, 22 ఏళ్ల వయసులో అంటే 2016వ సంవత్సరంలో ప్రముఖ బిజినెస్ మేన్ జీవీకే రెడ్డి మనవరాలు 26 ఏళ్ల శ్రేయ భూపాల్‌తో ఎంగేజ్మెంట్ జరిగింది. 2017లో ఇటలీలో వీరిద్దరి వివాహం జరగనుందని అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ పలు కారణాలతో రద్దైంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సక్సెస్ అందుకుని అఖిల్ మరిన్ని విజయాలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది న్యూస్ ఎక్స్ తెలుగు.