కిచ్చా సుదీప్ ఎంట్రీతో… వేడెక్కిన కన్నడ రాజకీయం
కర్ణాటకలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అక్కడి రాజకీయాలు వాడీవేడిగా మారాయి. ఒకవైపు సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉన్నట్లు చెబుతుండగా… బీజేపీ మాత్రం రిజర్వేషన్ల అంశం, యడుయూరప్ప, ఇతర స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించి మరోసారి అధికారంలోకి రావాలని ప్లాన్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కన్నడ ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి… కానీ అవన్నీ నిజం కాదని సుదీప్ చెప్పుకొచ్చారు. తాను బీజేపీలో చేరనని…. కానీ సీఎం బసవరాజ్ బొమ్మైకు మద్దతుగా ప్రచారం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తనకు చిన్నప్పటి నుంచి బొమ్మైతో అనుబంధం ఉందని, ఆయనను మామ అని పిలుస్తానని తెలిపారు. సినిమా రంగంలో తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బొమ్మై ఆదుకున్నారని చెప్పారు. సినిమా రంగంలో తనకు గాడ్ఫాదర్లు లేరని, ఎన్నో సందర్భాల్లో తనకు బొమ్మై అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. సీఎం బొమ్మై తరపున ప్రచారం చేస్తానని, ఆయన సూచించిన అభ్యర్థుల తరపునా ప్రచారానికి వెళ్తానని, అంబరీశ్ విషయంలోనూ ఇలాగే వ్యవహరించానని తెలిపారు. ప్రస్తుతం బొమ్మైకే తన మద్దతు అని తేల్చి చెప్పారు. ఇక సుదీప్ బొమ్మైకు మద్దతు తెలియజేయడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. బీజేపీ ఎవరినైనా ప్రభావితం చేయగలుగుతుందని, అయితే ఆరున్నర కోట్ల కన్నడ సోదర సోదరీమణులే ఎన్నికలను ప్రభావితం చేస్తారని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా వ్యాఖ్యానించారు. ఎన్నికలను సినిమా వాళ్లు ప్రభావితం చేయలేరని ఆయన చెప్పారు. అయితే.. నటుడు సుదీప్‌ను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ అవి వర్కౌట్ అవ్వలేదు. మరోవైపు.. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు సిద్దారామయ్యను మామ అని పిలుస్తారని.. తమకు రాజ్‌కుమార్ అభిమానులు మద్దతుగా ఉన్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొస్తున్నారు.
ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అయ్యారంటే…
భారతీయ జనతా పార్టీకి కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ మద్దతు ప్రకటించడంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. సుదీప్ నిర్ణయంతో తాను షాకయ్యానని చెప్పారు. తాను హర్ట్ అయ్యానన్నారు. బీజేపీ ఎలాంటి వారినైనా కొనుగోలు చేస్తుందని, ప్రభావితం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కర్నాటక నాయకులతోపాటు కేంద్రం నుంచి పలువురు మంత్రులు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా వంటి వారు బీజేపీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ ప్రక్రియ శనివారం చేపట్టనున్నట్లు కర్నాటక సీఎం బొమ్మై తెలిపారు.