‘కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. అప్రమత్తంగా ఉండాలి’

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రాలు మౌలిక సదుపాయాలను తనిఖీ చేయడానికి, పరీక్షలను పెంచడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగించవద్దని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ సమావేశంలో కోవిడ్ టెస్టింగ్, జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్ర మంత్రి చర్చించారు. సూచించిన కోవిడ్ నిబంధనలపై పౌరులకు అవగాహన కల్పించాలని, వాటిని పాటించాలని కోరారు. అన్ని ఆసుపత్రుల మౌలిక సదుపాయాల సంసిద్ధతను తనిఖీ చేయడానికి ఏప్రిల్ 10, 11వ తేదీన దేశవ్యాప్తంగా కోవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తామని మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. దీంతోపాటు ఆయా రాష్ట్రాలు వ్యాక్సిన్‌లను సొంత నిధులతో సమకూర్చుకోవాలని సూచించింది. మార్కెట్‌లో పుష్కలంగా వ్యాక్సిన్‌ నిల్వలు ఉన్నాయని సమాధానమిచ్చారు కేంద్ర మంత్రి. గడిచిన 24 గంటల్లో ఆరు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 6,050 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వైరస్ వల్ల తాజాగా 14 మంది చనిపోయినట్లు తెలిపారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.39 శాతానికి చేరిందన్నారు. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసులు 13 శాతం పెరిగాయి. అయితే .. దాదాపు రికవరీ రేటు 98 శాతంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.