పాల‌తో పండించే మామిడి గురించి తెలుసుకుందామా?

mangoes that grow with the help of milk

Mango: సాధార‌ణంగా ఏ మొక్కైనా నీళ్లు పోస్తేనే బ‌తుకుతుంది. మొక్క‌ల‌నే కాదు ఏ పంటైనా నీళ్ల‌తోనే చేతికొస్తుంది. కానీ ఈ మామిడి పండ్ల మొక్క మాత్రం నీళ్ల‌తో కాకుండా పాల‌తో పెరుగుతుంద‌ట‌. ఇదేం వింత మొక్క అనుకుంటున్నారా? అయితే దీని గురించి తెలుసుకుందాం రండి.

ఈ మామిడి పండు పేరు దూదియా మాల్దా. దూద్ అంటే హిందీలో పాలు అని అర్థం. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌ఖ్‌నౌకి చెందిన న‌వాబ్ ఫిదా హుస్సేన్ అనే రాజు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న షా ఫైజ‌ల్ మ‌సీదు నుంచి ఒక మామిడి మొక్క‌ను తెచ్చాడు. దానిని పాట్నాలోని దిఘా ప్రాంతంలో నాటాడు. ఇత‌ని వ‌ద్ద వేలాది ఆవులు ఉండేవి. వాటి పాలు త‌న కోట‌లోని వారంద‌రికీ స‌రిపోయాక కూడా మిగిలిపోతుండేవి. దాంతో మిగిలిపోయిన పాల‌తో ఏం చేయాలో తెలీక తాను నాటిన మామిడి మొక్క‌కు పోసేవాడ‌ట‌. ఇప్పుడు ఈ పండ్లు బిహార్‌లోని పాట్నాలో ఎక్కువ‌గా పండుతున్నాయి. పాట్నాలోని దిఘా అనే ప్రాంతంలోనే వీటిని పండిస్తార‌ట‌. సన్న‌టి టెంక‌, విప‌రీత‌మైన గుజ్జుతో ఈ పండు నోటికి త‌గ‌ల‌గానే అమృతం తిన్న‌ట్లు ఉంటుంద‌ట‌.

ఇప్పుడు ఈ మామిడి పండ్ల‌ను దాదాపు 33 దేశాల‌కు ఎగుమ‌తి చేస్తున్నారు. కొన్ని దేశాల ప్ర‌ధానుల నుంచి అధ్య‌క్షుల వ‌ర‌కు ఈ మామిడి పండ్ల‌కు ఫ్యాన్సే. ఒక‌ప్పుడు దిఘా ప్రాంతం అంత‌టా ఇవే మామిడి చెట్లు ఉండేవి. కానీ పెరుగుతున్న ఇళ్ల క‌ట్టడాల వ‌ల్ల కొన్ని ప్రాంతాల‌కే ఈ చెట్ల పెంప‌కం ప‌రిమితం అయ్యింది.