బీజేపీ కండువా కప్పుకున్న కిరణ్‌కుమార్‌రెడ్డి.. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి!
దేశంలో భాజపా రోజురోజుకీ బలపడుతోందని.. కాంగ్రెస్ నాయకత్వ లోపంతో దిగజారిపోతోందని ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఇక గత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన .. ఇవాళ బీజేపీ కండువ కప్పుకున్నారు. ఇవాళ ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్న ఆయన.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, సీఎంగా కిరణ్ సేవలందించారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కి క్లీన్ ఇమేజ్ ఉందన్నారు.
ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకున్న తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ కార్యకర్తల అమోఘమైన కృషి వల్లే దేశంలో భాజపా బలీయమైన శక్తిగా తయారైందని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి పరిస్థితి లేదన్నారు. వరుస ఓటముల నుంచి కాంగ్రెస్ పార్టీ గుణపాఠాలు నేర్వలేదన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. ఏపీ విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్.. 2019లో 37 శాతానికి పైగా పెరిగిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావాలన్నది బీజేపీ లక్ష్యం అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరిసారి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి.. ప్రస్తుతం బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. 2014లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి వీడ్కోలు పలికిన ఆయన.. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర అనేపేరుతో పార్టీ పెట్టి.. అడ్రెస్ లేకుండా పోయారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేశారు. మరి ఆయన రాకతో బీజేపీకి ఏమాత్రం బలం పెరుగుతుందో వేచి చూడాలి. మరోవైపు రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ కిరణ్‌కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.