ఆసక్తిగా మారిన చంద్రబాబు గుడివాడ పర్యటన!
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే వైసీపీ నాయకుల్లో ముందు వరుసలో ఉండేది మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్భాను సారంగా టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తుంటారు. ఇక గతంలో టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు.. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌పై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, దూషణలతో టీడీపీ నాయకులు చాలా కాలంగా వారిపై గుర్రుగా ఉన్నారు. చంద్రబాబును తిట్టాలంటే ముందుగా వైసీపీ పార్టీ ఉపయోగించేది.. ఈ ఇద్దరి ఎమ్మెల్యేలనే. ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కొడాలిని, వంశీని వారి నియోజకవర్గాల్లో ఓడించాలని టీడీపీ గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో చంద్రబాబు నాయుడు గుడివాడలో పర్యటించనున్నారు. అక్కడ రోడ్ షో కూడా ఏర్పాటు చేసి, ప్రసంగించనున్నారు. ఈక్రమంలో అసలు చంద్రబాబుని గుడివాడ టౌన్లో కొడాలి నాని అడుగుపెట్టనియ్యరని వైసీపీ నాయకులు సవాలు విసురుతున్నారు. దీంతో ఆ రోజు వైసీపీ,టీడీపీ వర్గీయుల మధ్య ఎలాంటి వాతావరణం నెలకొంటుందోనని పోలీసుల్లో సైతం కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభంలో భాగంగా..
టీడీపీ అధినేత గత కొన్ని నెలల కిందట ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కందుకూరులో కార్యక్రమం జరిగిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు. ఇక మలి విడతలో భాగంగా మళ్లీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 12న మచిలీపట్నంలో, ఈ నెల 13న గుడివాడలో రోడ్ షో, సభ నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 14న గుడివాడలో అంబేద్కర్ జయంతి నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక చంద్రబాబు గుడివాడ పర్యటన ఏవిధంగా ఉంటుంది. కొడాలి నానీని ఉద్దేశిస్తూ.. ఇప్పటి వరకు ఘాటు వ్యాఖ్యలు చేయని చంద్రబాబు ఎలాంటి విమర్శలు చేస్తారు.. దానికి కౌంటర్‌గా నాని ఏమంటారు అన్నదానిపై ఉత్కంట నెలకొంది.
నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు..
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటన ఖరారయ్యింది. గుడివాడ, మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, గుడివాడ పర్యటనపై పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, వెనిగండ్ల రాముతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని గుడివాడలో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిమ్మకూరులో ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 12న మచిలీపట్నంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రికి చంద్రబాబు గుడివాడలోనే బస చేయనున్నారు. ఈ నెల 14న ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నారు.