ఇంత మోసమా.. డైరెక్ట‌ర్‌పై పవన్​ ఫ్యాన్స్​ ఫైర్​!

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ సినిమా వస్తుందంటే మెగా అభిమానులకు పండగే. సినిమా మొదలైనప్పటినుంచీ ప్రతి అప్​డేట్​కి సంబరాలు చేస్తూ అంచనాలను పెంచుతూనే ఉంటారు. తాజాగా పవన్​ కల్యాణ్​ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్న పవన్​ వీలైనంత తొందరగా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందుకే గ్యాప్​ లేకుండా వరుసగా సినిమాలకు డేట్స్ ఇస్తూ ఇన్నాళ్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమాలను పూర్తి చేసేస్తున్నారు. ఇటీవలే సముద్ర ఖని దర్శకత్వలో రూపొందుతున్న వినోదయా సిత్తం సినిమా రీమేక్​ షూటింగ్​ను కేవలం 25 రోజుల్లో పూర్తి చేసేసారు పవన్. ఈ సినిమాలో సాయిధరమ్​ తేజ్​ ప్రధాన పాత్రలో కనిపిస్తుండగా పవన్​ కల్యాణ్​ కీలక పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్​ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ఉస్తాద్​ భగత్​సింగ్​ పోస్టర్​ అభిమానులను అసహనానికి గురిచేస్తోంది. ‘గబ్బర్​ సింగ్​ని మించిన హిట్​ ఇస్తారని ఎదురు చూస్తుంటే.. హరీష్​ ఇంత మోసం చేస్తారా..’ అంటూ ఫ్యాన్స్​ మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రెండేళ్ల క్రితం హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సూపర్ హిట్ సినిమా ఇచ్చిన హరీష్ శంకర్ తో పవన్ సినిమా అనౌన్స్ చేయడంతో అభిమానులంతా సంతోషం వ్యక్తం చేసి ఈ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ అనౌన్స్ చేసి ఇటీవల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఓ చైర్ లో కూర్చొని పోలీస్ గెటప్ లో ఓ చేతిలో రివాల్వర్, ఓ చేతిలో చై గ్లాస్ పట్టుకొని ఉన్నాడు. వెనుక నుంచి తీసిన ఫోటోని పోస్టర్ తో రిలీజ్ చేశారు.
అయితే ఈ పోస్టర్ వైరల్ అవ్వగా ఈ ఫొటోలో ఉన్నది హరీష్ శంకర్ అని, హరీష్ శంకర్ ఫోటో పెట్టి ఫ్యాన్స్ ని మోసం చేయాలనుకుంటున్నారా అంటూ హరీష్ ని, మైత్రి నిర్మాణ సంస్థని ట్రోల్ చేస్తున్నారు అభిమానులు, నెటిజన్లు. ఈ పోస్టర్ చూస్తుంటే అచ్చం హరీష్ శంకర్ ని వెనుక నుంచి చూసినట్టే ఉంది. దీంతో అందరూ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం పవన్ ని కొత్త లుక్ లోకి మార్చారా అని కామెంట్స్ చేస్తున్నారు.