ట్రాఫిక్‌, కాలుష్యం వల్ల బీపీ, గుండె జబ్బులు వస్తాయట! 

ప్రస్తుతం పట్టణీకరణ పెరుగుతోంది. పల్లెల్లో ఉండే ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర పనుల కోసం పట్టణాలకు వచ్చి జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈక్రమంలోనే పట్టణ జనాభా క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీంతో వాహన సంఖ్య అందుకు తగ్గట్టే గతం కంటే ఇప్పుడు ఎక్కువయ్యాయి. ఈనేపథ్యంలోనే వాయు కాలుష్యం పెరగడం, ట్రాఫిక్‌ సమస్యలు, శబ్ద కాలుష్యం సైతం అధికమైంది. అయితే.. ఈ కాలుష్యం, ట్రాఫిక్‌ చికాకులు, శబ్ద కాలుష్యాలు.. మానవుల్లో అధిక రక్తపోటు(హైబీపీ), గుండె జబ్బులకు రానున్న రోజుల్లో కారణం కానున్నాయని అమెరికాకు చెందిన నిపుణులు చెప్పడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్‌ సమస్యలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఈక్రమంలో అవి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణుల హెచ్చరిక వెన్నులో వణుపు పుట్టిస్తోంది. నిపుణులు అధ్యయనం చేసిన వివరాలు ఇలా..

అనేక సందర్బాల్లో మనం బయటకు వెళ్లినప్పుడు.. ట్రాఫిక్‌లో చిక్కుకోవడం సహజంగా జరుగుతుంది. అలాంటప్పుడు మనలో చాలామందికి తలనొప్పి, చికాకు కలగుతుంటాయి. ఆ సమయంలో పలు వాహనాల నుంచి వచ్చే శబ్దాలు, వాహనాల నుంచి వచ్చే పొగలు మరింత ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అయితే ఇవన్నీ మనకు తెలియకుండానే.. శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిపై ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ’లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం…. రహదారి ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్దం, వాయు కాలుష్యానికి అధికంగా మనం గురవ్వాల్సి వస్తే.. అధిక రక్తపోటు వస్తుందని పేర్కొంది. దీనిపై యూఎస్‌ఏలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు.. 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు ఉన్న 2,40,000 కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి యూకే బయోబ్యాంక్ డేటాను ఉపయోగించి మనుషుల్లో వచ్చే రక్తపోటుకు గల కారణాలపై అధ్యయనం చేశారు. అందులో.. శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం వల్ల బీపీ సమస్యలు వచ్చే అవకాశం ఉందని వారు కనుగొన్నారు. అదే విధంగా వారు ఉంటున్న ఏరియా ఆధారంగా, వారు ఎక్కడెక్కడ ఎంత దూరం తిరుగుతారు.. అక్కడ ఉండే ట్రాఫిక్‌ ఏవిధంగా ఉంటుంది అన్న వాటిపై కూడా అధ్యయనం చేయగా.. నాయిస్ అసెస్‌మెంట్ మెథడ్ ఆధారంగా రోడ్డు ట్రాఫిక్ శబ్దాన్ని అంచనా వేస్తూ.. ట్రాఫిక్ శబ్దం, వాయు కాలుష్యం రెండింటినీ ఎక్కువగా గురయ్యే వారికి అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలో వాయు కాలుష్యం పాత్ర కూడా ప్రధానంగా ఉంటుందని పేర్కొన్నారు. అసలు వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ శబ్దం వల్ల రక్తపోటు వస్తుందని తెలిసినప్పుడు తాము ఆశ్చర్యపోయామని అధ్యయనం చేసిన జింగ్ హువాంగ్ తెలిపారు.

అపోలో వైద్యులు కూడా నివేదికను సమర్థిస్తున్నారు..

ఈ అధ్యయనాన్ని ధృవీకరిస్తూ హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్ కపూర్ మాట్లాడుతూ.. “మన భారతదేశంలో ఇలాంటి అధ్యయనాలు లేనప్పటికీ, కొంత కాలంగా అంటే.. గడిచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో.. ప్రశాంత వాతవరణంలో ఉండే వారి కంటే.. నిత్యం ట్రాఫిక్ శబ్దం ఉండే ప్రాంతాల్లో తిరిగేవారికి ఉండేవారికి ఎక్కువగా అధిక రక్తపోటు ఉండటం గమనించామని ఆయన తెలిపారు. నిరంతరం వినిపించే పెద్దశబ్దం మనిషిలోని సెన్సిటివ్‌ నాడిని ప్రేరేపిస్తుందని.. ఇది ఒత్తిడి స్థాయిని మరియు రక్తపోటును పెంచుతుందన్నారు. అంతే కాకుండా.. ‘ఇది శబ్ద కాలుష్యం గురించి మాత్రమే కాదు, వాయు కాలుష్యం కూడా గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. వాయు కాలుష్య కారకాల నుంచి వెలువడే సూక్ష్మకణాలు శరీరంలోకి ప్రవేశించి గుండె ధమనులలో నిక్షిప్తం అవుతాయని.. అవి రక్తప్రసరణకు అడ్డు పడే ఛాన్స్‌ కూడా ఉందన్నారు. అందుకే.. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాయు కాలుష్యానికి, వాహనాల నుంచి వెలువడే పొగ అధికంగా వచ్చే… అంటే వాహన రద్దీ ప్రాంతాల నుంచి ప్రజలు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిదని… ఒకవేళ ఉండాల్సి వస్తే.. మాస్కులు, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ కపూర్ తెలిపారు.