నాది కాంగ్రెస్ రక్తం..వేరే ఆప్షన్ లేదు
పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. అధికారికంగా తాను ఎక్కడా ప్రకటించలేదని.. ఉద్దేశ్యపూర్వకంగా కొందరు తనసై అసత్య వార్తలను ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. ‘నాది కాంగ్రెస్ రక్తం.. నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు’ అంటూ కోమటిరెడ్డి బదులిచ్చారు. తాను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాననడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయనని స్పష్టం చేశారు. బుధవారం అంతా తాను సోనియాగాంధీతోనే ఉన్నానని తెలిపారు. భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను అని వెల్లడించారు.
కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ..
కాంగ్రెస్‌లో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేస్తూ వస్తున్నా తనకు తగిన గుర్తింపు , పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేడని గత కొంతకాలంగా కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన కాంగ్రెస్ ను వీడాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడటం నుంచి పార్టీ పెద్దలతో కూడా కోమటిరెడ్డి పెద్దగా మాట్లాడలేదని సమాచారం. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన యాత్రలోనూ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రల్లోనూ కోమటిరెడ్డి కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారుతున్నారని వార్తలు రాగా… దీనిపై ఎక్కడా స్పందించలేదు. ఇక ఇటీవల జరిగిన సీడబ్లూసీ మీటింగ్‌లో కూడా తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని కొంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇలాంటి ఊహాగానాలకు చెక్ పెడుతూ.. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ముందుకు వచ్చి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.