పద్మశ్రీ అందుకున్న కీరవాణి

సంగీత స్వరవాణి కీరవాణి తన ప్రతిభతో తెలుగు సినిమాను ప్రపంచ వేదికపై నిలిపిన సంగతి తెలిసిందే. ఎమ్​. ఎమ్​. కీరవాణి సంగీతం అందించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్​ ఒరిజినల్ స్కోర్​ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకుని టాలీవుడ్​ సత్తాని విశ్వవ్యాప్తం చేసింది. ఈ సందర్భంగా ఆ పాటకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్​ అకాడమీ వేదికపై ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఈ క్రమంలోనే కీరవాణి మరో ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్నారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీరవాణి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ఇటీవల ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనట్లు స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం పద్మశ్రీ అందుకున్నారు కీరవాణి. ఈ వేడుకకు కీరవాణి వెంట ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి సతీమణి శ్రీవల్లి, కుమారుడు కాలభైరవ తదితరులు హాజరయ్యారు.

కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ సినిమా భారీ వసూళ్లను సాధించింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో వసూళ్ల వర్షం కురిపించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక, ఈ సినిమాలో హీరోలుగా చేసిన మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌‌ గ్లోబల్ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. వీరికి జోడీగా బాలీవుడ్​ భామ ఆలియా భట్​, హాలీవుడ్ సుందరి ఒలీవియా ఆడిపాడారు. ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. కాగా, పద్మశ్రీ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణిని పలువురు అభినందిస్తున్నారు. సోషల్ మీడియాతోపాటు పలు మాధ్యమాల్లో శుభాకాంక్షలు అందజేస్తున్నారు.