Avinash Reddy: నేను గెలిస్తేనే వివేకా ఆత్మ శాంతిస్తుంది

Avinash Reddy:  క‌డ‌ప ఎంపీగా తాను గెలిస్తేనే చ‌నిపోయిన వివేకానంద రెడ్డి ఆత్మ శాంతి క‌లుగుతుందని అన్నారు అవినాష్ రెడ్డి. వివేకా హ‌త్య కేసులో అవినాష్ ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై వైఎస్ ష‌ర్మిళా, వైఎస్ సునీత‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ కడప ఎంపీగా అవినాష్‌ను ఓడించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క మాట కూడా మాట్లాడ‌ని అవినాష్ రెడ్డి.. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ త‌న త‌ప్పు లేద‌ని తెలిపారు.

క‌డ‌ప ఎంపీగా తాను గెలిస్తేనే వివేకానంద రెడ్డి ఆత్మ శాంతి క‌లుగుతుంద‌ని.. ష‌ర్మిళ‌, సునీత‌ల కంటే తాను ప‌దేళ్లు చిన్న‌వాడిన‌ని.. అలాంటి త‌న‌పై ఎందుకు ఇంత ద్వేష‌మో త‌న‌కు ఏమాత్రం అర్థంకావ‌డంలేద‌ని అన్నారు. “” నాడు జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వివేకా ఓడిపోయాక నా మీద కానీ మా నాన్న మీద కానీ కోప‌డిన దాఖ‌లాలు లేవు. ఇవ‌న్నీ పుట్టించిన క‌ట్టు క‌థ‌లు. పులివెందుల మున్సిపాలిటీలో త‌క్కువ ఓట్లు వ‌చ్చాయి అన‌డంలో ఏమాత్రం నిజం లేదు. పులివెందుల ఓటర్ల‌ను కూడా అవ‌మానిస్తున్నారు. మీరు చూసారా ఎన్నిక‌లు ఎలా జ‌రిగాయో? సునీత‌, సీబీఐ, ద‌స్త‌గిరి డీల్ కుదుర్చుకుని మమ్మ‌ల్ని టార్గెట్ చేస్తున్నారు. వివేకా కేసులో ప్ర‌త్య‌క్ష సాక్షి అయిన రంగ‌న్న న‌లుగురు పేర్లు చెప్పాడు. కానీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోలేదు.

నెల రోజుల పాటు ఎవ్వ‌రినీ అరెస్ట్ చేయ‌లేదు. నెల రోజుల త‌ర్వాత ద‌స్తగిరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. తానే ఈ హత్య చేసాన‌ని ఒప్పుకున్నాడు. అయినా సీబీఐ అరెస్ట్ చేయ‌లేదు. అక్టోబ‌ర్ 2021 వ‌ర‌కు అత‌న్ని అరెస్ట్ చేయ‌లేదు. అత‌ను ముంద‌స్తు బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడంలో సీబీఐకి అభ్యంత‌రం లేద‌ని చెప్పింది. అత‌ని బెయిల్ ఆపేందుకు మాత్రం సునీతా రెడ్డి ఎలాంటి చ‌ర్య తీసుకోలేదు. సాధార‌ణంగా ఓ నిందితుడు అప్రూవ‌ర్‌గా మారినా కూడా అత‌నికి కోర్టు విధించిన జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ గ‌డువు ముగియాల్సిందే. కానీ ద‌స్తగిరి విష‌యంలో అలాంటిది ఏమీ జ‌ర‌గ‌లేదు. అత‌ను అప్రూవ‌ర్‌గా మార‌డంతో వెంట‌నే బెయిల్ ఇప్పించేసి వ‌దిలేసారు. నిన్ను నిందితుడి నుంచి అప్రూవ‌ర్‌గా మారుస్తాం. అస‌లు జైలుకే పోవాల్సిన ప‌నిలేకుండా చూస్తాం అని చెప్తే ఏ నిందితుడైనా ఎవ‌రి పేరైనా చెప్తాడు. “”  అని తెలిపారు.

ఇలాంటి మ‌రిన్ని వార్త‌లు చ‌ద‌వడానికి చూడండి https://telugu.newsx.com/