Ram Navami విశిష్ఠత ఏంటి? ఆరోజున కళ్యాణం ఎందుకు చేస్తారు?
Ram Navami: ఈ నెల 17న శ్రీరామ నవమి రాబోతోంది. అసలు శ్రీరామ నవమి అంటే ఏంటి? రాముడి పుట్టిన రోజా? లేక పెళ్లి రోజా? రామ నవమి రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు? రామ నవమి విశిష్ఠత వంటి అంశాలను తెలుసుకుందాం.
సమస్త లోకాలకు ఆది దేవుళ్లైన త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీమహా విష్ణువే మానవునిగా జన్మించి లోక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించాడు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే కాక తన జీవితానికి భావితరాలకు ఆదర్శప్రాయంగా చూపిన యుగ పురుషుడు రఘురాముడు. అఖండ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకానికి సిద్ధమైన సమయంలో ఎంత ఆనందంగా ఉన్నాడో అదే ముహూర్తంలో అరణ్యాలకు వెళ్లాల్సి వచ్చినా అంతే ఆనందంతో ఉన్నాడు రామయ్య. తన భార్య సీతాదేవిని ఎత్తుకెళ్లిన రావణాసురుడితో ధర్మ బద్ధమైన యుద్ధం చేసి తన సఖిని తిరిగి తెచ్చుకున్నాడు. జయించిన సువర్ణ లంక ముందున్న తన మాతృభూమే మిక్కిలి ప్రధానమని భావించాడు.
వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ధర్మాలలో సామాజిక ధర్మానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన రామచంద్రుడు జనాలు రాజును అనుసరిస్తారని జన వ్యాఖ్యానికి ప్రాధాన్యత ఇచ్చి నిర్ధోషి అని తెలిసి తన భార్యను అరణ్యాలకు పంపాడు. నా శ్రీరాముడి ఏకపత్నీవ్రతుడు. నా రాముడు పితృవాఖ్య పరిపాలకుడు. నా రాముడు ఆదర్శ సోదరుడు. నా రాముడు సువర్ణ యుగాన్ని స్థాపించిన మచ్చ లేని మహారాజు. నా రాముడు ధర్మానికి తప్ప మరే శక్తికి కట్టుబడని వాడు. నా రాముడు ఎదురులేని పరాక్రమవంతుడు. అందుకే ఆయన వ్యక్తిత్వం మానవాళికి ఆదర్శ ప్రాయం.
పుట్టిన రోజు నాడు రామయ్య కళ్యాణం ఎందుకు చేస్తారు?
24వ మహాయుగంలో త్రేతాయుగంలో విళంబి నామ సంవత్సరం చైత్ర మాసంలో వచ్చిన చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్నం పునర్వసు నక్షత్రంలో రామయ్య ఈ భూమిపై జన్మించాడు. ఆ నవమి రోజే శ్రీరామ నవమిగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు 28వ మహాయుగంలో కలియుగం జరుగుతోంది. అంటే.. ఇప్పటికే సుమారు కోటి 81 లక్షల 47 వేల సంవత్సరాల పూర్వం శ్రీరామ అవతరణం జరిగిందని ఓ అంచనా.
శ్రీరామ నవమి రాముడు పుట్టినరోజు అయితే ఆరోజున కళ్యాణం ఎందుకు చేస్తారు? వాల్మీకీ రామాయణంలో చైత్ర శుక్ల నవమి నాడు రాముడు జన్మించాడు అని చెప్పారే తప్ప కళ్యాణం జరిగిందని చెప్పలేదు. ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో సీతారాముల కళ్యాణం జరిగినట్లు వాల్మికి పేర్కొన్నారు. అయితే శ్రీరామ నవమి రోజున రాముల వారి కళ్యాణం జరగడానికి ఓ కారణం ఉంది. సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం. ఎన్ని కష్టాలు వచ్చినా పతే పరమావతిగా ఆయన వెంటనే నిడిచింది సీతమ్మ తల్లి. అపర పతివ్రతగా కీర్తిఘడించింది.
తన స్వామి పేరు కోసం నిండు గర్భిణిగా ఉండీ అరణ్యవాసం చేసిన మహాతల్లి. అందుకే ఈ లోకంలో రాముడిని మించిన రాజు, సీతమ్మ తల్లికి మించిన సాత్వి లేదు. అందుకే కలలో కూడా వారిని వేరు వేరుగా పిలవాలని తలంపు ఎవ్వరికీ రాదు. ఆ కారణం వల్లే నేటికీ ఆ దశరథ తనయుడిని సీతారాముడిగా జానకి రాముడిగానే పిలుస్తారు. వారిద్దరినీ కలిపే కొలుస్తారు. అంతటి ఆదర్శ దంపతులను వేరు వేరుగా చూడకూడదు. అందుకే శ్రీరామ నవమి రాముడు పుట్టినరోజు అయినా ఆరోజున సీతారాములను కలిపే పూజించాలి. అందుకే నవమి రోజున వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.