పరీక్ష పత్రం లీక్‌లో బండి ఏ1… జైలుకు వెళ్తూ ఏమన్నారంటే?

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం అంతా హైడ్రామా నడిచింది. నిన్న అర్ధరాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని అరెస్టు చేయడంతో మొదలైన నిరసనలు.. సాయంత్రం వరకు కొనసాగాయి. అయితే.. టెన్త్ హిందీ పరీక్ష పత్రం లీక్‌ చేయడంతో ప్రధాన సూత్రధారి బండి సంజయ్‌ అని వరంగల్‌ సీపీ రంఘనాథ్‌ నిన్ని సాయంత్రం మీడియాకు తెలిపారు. పరీక్ష పేపర్‌ లీకేజీకి బండి సంజయ్‌ ప్రధాన సూత్రధారి అని ప్రకటించారు. ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఆపై నాటకీయ పరిణామాల మధ్య కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈక్రమంలో బండి తరపు లాయర్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. గురువారం విచారిస్తామని కోర్టు పేర్కొంది. దీంతో ఆయనను కరీంనగర్‌ జైలుకు తరలించారు.

రోజంతా హైడ్రామా..
సంజయ్‌ తరలింపులో బుధవారం అంతా హైడ్రామా చోటుచేసుకుంది. బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటెల రాజేందర్‌, రాజాసింగ్‌ సహా పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బండి సంజయ్‌ అరెస్టును బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. అమిత్‌ షా, నడ్డా, తరుణ్‌ ఛుగ్‌.. తెలంగాణ బీజేపీ నాయకులుతో వరుసగా మాట్లాడారు. ఇక బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌ నుంచి వరంగల్‌ కోర్టుకు తరలించే క్రమంలో పోలీసులు ఆయన్ను సాయంత్రం దాకా పలు చోట్ల తిప్పారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆందోళనలు చేపట్టాయి. సంజయ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. అయితో బీఆర్‌ఎస్‌ మంత్రులు, నాయకులు బండి సంజయ్‌ తీరుపై మండిపడ్డారు. కేవలం రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తును పాడుచేసేందుకు పూనుకోవడం దుర్మార్గమని వారు విరుచుకుపడ్డారు.

పోలీసులు నన్ను కొట్టారు – బండి
ఈ కేసులో బండి సంజయ్‌తోపాటు… ఇతర నిందితులు బూర ప్రశాంత్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ గుండెబోయిన మహేష్‌, విద్యార్థి మౌతం గణేష్‌ను కూడా విచారించారు. వీరితోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్‌ పోగు సుభాష్‌, విద్యార్థులు పోగు శశాంక్‌, దూలం శ్రీకాంత్‌, పెరుమాండ్ల శ్రామిక్‌ పరారీలో ఉన్నారని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక మరోవైపు పోలీసులు విచారణ సమయంలో తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని, వివిధ పోలీసుస్టేషన్లకు తిప్పుతూ తీవ్రంగా కొట్టారని సంజయ్‌ జడ్జికి ఫిర్యాదు చేశారు. తన ఒంటిపై ఉన్న వాతలను చూపించారు. అంతకుముందు సంజయ్‌ తరపు న్యాయవాదులు వాదనలను వినిపిస్తూ ఆయనపై పోలీసులు పెట్టిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు శిక్షపడేవేనని, ఈ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో ముద్దాయికి స్టేషన్‌లోనే నోటీసు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉందన్నారు. కుట్రపూరితంగా సంజయ్‌ని వేధించేందుకు కోర్టుదాకా తీసుకువచ్చారన్నారు. సెక్షన్‌ 41ఏ అమలు కోరుతూ మెమోను ఫైల్‌ చేశారు. దీనికి బదులిచ్చిన జడ్జి ఈ కేసుల్లో సెక్షన్ 41ఏ నిబంధనలు వర్తించవని తెలిపారు. దీంతో పిటిషన్‌పై విచారణను న్యాయమూర్తి గురువారానికి వాయిదా వేశారు. బండిపై మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద పోలీసులు కేసులు పెట్టారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, పోలీసుల చర్యను నిరసిస్తూ బండి సంజయ్‌ బుధవారం రాత్రి పొద్దుపోయే వరకూ భోజనం చేయలేదని సమాచారం. పోలీసుల వలయంలోనే ఉండిపోయిన ఆయన వారి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మంచినీరు కూడా తీసుకోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.