Ram Navami: తిరుపతి వెళ్లి మరీ ఇది మిస్సవుతున్నారు
Ram Navami: కొన్ని సార్లు మనం ఎంతో కష్టపడి ఒక క్షేత్రానికి వెళ్తాం. వెళ్లి.. అక్కడ గబగబా దర్శనం చేసుకుని వచ్చేస్తామే తప్ప చుట్టు పక్కల ఉన్న అపురూప ప్రదేశాలను చూడకుండా వచ్చేస్తుంటారు. చాలా మంది అలాంటి ప్రదేశాలు ఉన్నాయని తెలీక మిస్సయిపోతుంటారు. అలాగే.. తిరుమల కానీ తిరుపతి కానీ మనమంతా పదులు, వందల సార్లు వెళ్లి ఉంటాం. అలా వెళ్లి వారిలో కూడా కొంత మంది మిస్సయిపోయే ఒక అద్భుతమైన ఆలయం ఉంది. తిరుపతిలో త్రేతాయుగంలో జాంబవంతుల వారు నిర్మించిన సీతారామ లక్ష్మణుల మూర్తులు ఉండే ఆలయం ఉంది.
ఆ ఆలయం పేరు కోదండ రామస్వామి ఆలయం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఆ ఆలయం కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నడిబొడ్డులో ఉంది ఈ ఆలయం. కానీ చాలా మందికి తెలీక వెళ్లరు. ఆ ఆలయానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తికి తిరుమలకు చాలా సంబంధం ఉంది. దశరథ మహారాజు అక్కడ తపస్సు చేసాక రాముడు పుట్టాడు అని పురాణంలో ఉంది. అలాగే రాముడు సీతమ్మను వెతుకుతూ వచ్చినప్పుడు వానర వీరులంతా కొండ మీదకు వచ్చారు. అలా వచ్చినప్పుడు జాంబవంతుడు అక్కడ ఒక చోట గుహలో సీతారామ లక్ష్మణుల మూర్తులను ప్రతిష్ఠించి అర్చించాడు. అది క్షేత్రమైంది. ఆ తర్వాత ఆలయం కాలగర్భంలో కలిసిపోయింది.
జాంబవంతుల వారి కాలంలో ఆలయం కాలగర్భంలో కలిపోయాక ఆ తర్వాత జనమేజయ చక్రవర్తి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఆ సమయంలో ఈ తిరుపతిలోని రాముడి ఆలయానికి వెళ్లి మళ్లీ మూర్తులను ప్రతిష్ఠించారు. ఈ ఆలయంలో శంఖ, పద్మ నిధులు, మూల విరాట్, స్తంభ హనుమాన్, గణేశుడు, గాలి గోపురం, పారిజాత హనుమాన్, భక్తాంజనేయ విగ్రహాలు కనిపిస్తాయి. తప్పకుండా ఈసారి మీరు తిరుపతి వెళ్లినప్పుడు దర్శించుకోండి.