గిఫ్ట్‌ పేలి పెళ్లికొడుకు మృతి.. మాజీ ప్రియుడి మాస్ట‌ర్ ప్లాన్

ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరొక అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని ఓ వ్యక్తి రగిలిపోయాడు. ఎలాగైన పెళ్లి చేసుకునే జంటని వేరు చేయాలని భావించాడు. అందుకు ఓ ఉపాయాన్ని ఎంచుకున్నాడు. ప్రేమించిన యువతి పెళ్లికి వెళ్లిన ప్రియుడు.. మంచి హోమ్‌ థియేటర్‌ని గిఫ్ట్‌గా కొని దంపతులకు ఇచ్చాడు. అయితే.. అందులో పేలుడు పదార్థాలు పెట్టి ఇచ్చాడు. ఈక్రమంలో గిఫ్ట్‌లను ఒక్కొక్కటిగా చూస్తుండగా.. హోమ్‌ థియేటర్‌ పెళ్లి కొడుక్కి కనిపించింది. దాన్ని వెంటనే కరెంట్‌ బోర్టులో పెట్టి స్విచ్‌ వేయగానే పెద్ద శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో పెళ్లి కొడుకుతోపాటు, అతని అన్న కూడా చనిపోయారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో సోమవారం చోటుచేసుకుంది.

ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్లకు బంధువులు, స్నేహితులు గిఫ్ట్‌లు ఇస్తుంటారు. వాటిని పొందిన వారు కూడా వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుని గుర్తుగా అలా ఉంచుకుంటున్నారు. కానీ చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన గురించి తెలిస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. ఇటీవల అక్కడ జరిగిన ఓ పెళ్లికి గిఫ్ట్‌ ఇచ్చిన హోం థియేటర్‌ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన అందరినీ నిర్ఘాంతపోయేలా చేసింది. అసలేం జరిగిందంటే..

చత్తీస్‌గఢ్‌లోని కబీర్ ధామ్ జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మెరావి (22)కి. అంజనా గ్రామానికి చెందిన యువతితో ఏప్రిల్‌ 1న అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. ఈ సందర్బంగా బంధువులు, ఫ్రెండ్స్ రకరకాల గిఫ్ట్ లు వారికి ఇచ్చారు. అందులో ఒక హోమ్ థియేటర్ సెట్ కూడా ఉంది. వేడుక కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత సోమవారం కుటుంబ సభ్యులంతా కలిసి.. వచ్చిన గిఫ్ట్‌లను ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్‌ చేస్తూ వచ్చారు. అలానే హోమ్ థియేటర్ సెట్‌ను కూడా పెళ్లి కొడుకు కరెంటు బోర్డుకు కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేశారు. అంతే.. ఒక్కసారిగా ఆ మ్యూజిక్ సిస్టమ్ భారీ సౌండ్‌తో పేలిపోయింది. దీంతో పెళ్లి కొడుకు హేమేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతనితోపాటు అక్కడే ఉన్న ఏడాదిన్నర చిన్నారితో సహా నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. ఈక్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. హేమేంద్ర అన్న రాజకుమార్(30) చనిపోయారు. పేలుడు ధాటికి మ్యూజిక్ సిస్టమ్ ఉన్న గది గోడలు… ఇంటి పైకప్పు కూడా కూలిపోయింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ బృందాలు స్పాట్కు వెళ్లి పరిశీలించగా. హోమ్ థియేటర్ సెట్లో పేలుడు పదార్థం ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని కబీర్ ధామ్ జిల్లా ఎస్సీ లాల్ ఉమెద్ సింగ్ వివరించారు.

విచారణలో అసలు విషయం తేలింది..
పోలీసులు వివాహం సందర్భంగా అందుకున్న బహుమతుల జాబితాను పరిశీలించడం ప్రారంభించగా.. మ్యూజిక్‌ సిస్టమ్‌ను వధువు మాజీ ప్రేమికుడు నుంచి బహుమతిగా వచ్చిందని గుర్తించారు. అతని పేరు సర్జుగా గుర్తించి… వెంటనే అరెస్టు చేశారు. కబీర్‌ధామ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీషా ఠాకూర్ మాట్లాడుతూ.. పోలీసుల విచారణలో నిందితుడు తన మాజీ ప్రియురాలితో పెళ్లి జరగనందున.. కోపంతో ఆ పనిచేశానని ఒప్పుకున్నాడు. ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను హోమ్ థియేటర్ లో పెట్టి గిఫ్ట్‌గా ఆమెకు ఇచ్చినట్లు తెలిపారు.