Viveka Murder Case: అవినాష్‌కు సపోర్ట్ చేస్తున్న దస్తగిరి?
Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. ఇప్పుడు ప్రధాన నిందితుడైన అవినాష్ రెడ్డికి (Avinash Reddy) సాయం చేస్తున్నాడా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. కడప ఎంపీ సీటు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సీటు నుంచి కాంగ్రెస్ తరఫున వైఎస్ షర్మిళ (YS Sharmila) పోటీ చేస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు పోటీకి దిగడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి (YS Sunitha Reddy) కూడా షర్మిళతో కలిసి పాల్గొంటున్నారు. ప్రచారంలో ఎక్కువగా వైఎస్ వివేకా హంతకులు అంటూ అవినాష్, జగన్ మోహన్ రెడ్డిలను టార్గెట్ చేసి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ పిటిషన్ వేసారు. షర్మిళ కానీ సునీతా రెడ్డి కానీ వైఎస్ వివేకా హత్య గురించి ఎన్నికల్లో ప్రస్తావించకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. షర్మిళ, సునీతలతో పాటు బీటెక్ రవి కూడా దీని గురించే ప్రచారంలో మాట్లాడుతున్నారు. దాంతో అసలు ప్రచారంలో భాగంగా ఎవ్వరూ కూడా వివేకా హత్య గురించి రాజకీయంగా మాట్లాడకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో సునీతా రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ హత్య ఎలా జరిగిందో చూపించారని, ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఇలాంటి ప్రెజెంటేషన్‌లు ఎలా వేస్తారని దస్తగిరి పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికలు అయ్యే వరకు ఏ పార్టీ వారు కూడా వివేకా హత్య గురించి ప్రస్తావించకూడదని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇది ఓ రకంగా అవినాష్‌కు బాగా కలిసొచ్చే అంశంగా అనిపిస్తోంది. ఎందుకంటే అవినాష్‌కు వివేకా హత్య విషయమే పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే షర్మిళ, సునీతలు ఇదే అంశం గురించి ప్రస్తావించి అవినాష్‌ను ఓడించాలని అనుకుంటున్నారు. దస్తగిరి కూడా ఈ కేసులో అప్రూవర్‌గా మారి అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు పిటిషన్ వేసాడో తెలియాల్సి ఉంది.