ఫొటోలు పోర్న్ సైట్స్‌లో పెడతానంటున్నాడు: నటి ఆవేదన
మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎందరో నటీనటులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు బయటపెట్టారు. ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేసారు. కానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం ఇప్పటికీ పలువురు నటీమణులు ఈ వేధింపులకు గురవుతున్నారు. తాజాగా స్వస్తిక ముఖర్జీ అనే నటి తనను ఓ నిర్మాత వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మీడియా ముందుకు వచ్చారు. ఆమె షిబ్పూర్ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా నిర్మాతల్లో సందీప్ సర్కార్ అనే ఎన్నారై ఒకరు. సినిమా షూటింగ్ అయిపోయాక ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటానని స్వస్తిక నిర్మాతలకు చెప్పారట. కానీ అసలు పోస్టర్ రిలీజ్ అయినట్లు కానీ, ప్రమోషన్స్ గురించి కానీ నిర్మాతలు తనకు ఏమీ చెప్పలేదట. రెండు రోజుల క్రితం సందీప్ సర్కార్ నుంచి తనకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు స్వస్తిక తెలిపారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు.
“నేను సినిమాలో నటిస్తున్నన్ని రోజులు ఈ సందీప్ సర్కార్ అనే వ్యక్తి గురించి నేను ఎప్పుడూ వినలేదు. సడెన్‌గా నాకు సందీప్ అనే వ్యక్తి గురించి మెయిల్స్ వచ్చాయి. ఆ మెయిల్స్‌లో నేను సహకరించకపోతే నేను ఎప్పటికీ అమెరికాకు వెళ్లకుండా వీసా ఆపించేస్తానని, కమీషనర్‌కు, ముఖ్యమంత్రికి చెప్పి అసలు జీవితమే లేకుండా చేస్తానని రాసుంది. అసలు అతను ఎవరో ఏంటో నాకు తెలీదు. ఏ విషయంలో సహకరించాలంటున్నాడో అర్థంకావడంలేదు. నేను సినిమా ప్రమోషన్స్‌కు కూడా వస్తానని చెప్పాను. కానీ నన్ను ఎవ్వరూ సంప్రదించలేదు. రవిష్ శర్మ అనే వ్యక్తి కూడా నాకు మెయిల్స్ పెట్టాడు. అతను సందీప్ స్నేహితుడట. అతనికి కంప్యూటర్ హ్యాకింగ్ బాగా తెలుసట. నా సోషల్‌మీడియాను హ్యాక్ చేసి నా ఫోటోలు మార్ఫ్ చేసి పోర్న్ సైట్లలో పెడతానని బెదిరిస్తున్నారు. పైగా నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నానని అంటున్నారు. కాంట్రాక్ట్‌లో రాసినదానికంటే ఒక్క రూపాయి కూడా అదనంగా పుచ్చుకోలేదు” అని వాపోయారు స్వస్తిక.