బండి సంజయ్ అరెస్టుపై భగ్గుమన్న నాయకులు
తెలంగాణలోని కరీంనగర్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని మంగళవారం అర్దరాత్రి దాటిన తర్వాత పోలీసులు అరెస్టు చేయడాన్ని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు ఖండించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని వారు మండిపడ్డారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇవాళ ఉదయం నుంచి తెలంగాణలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వాటి సంబంధించిన జరిగిన సంఘటనలు ఇలా..
అర్ధరాత్రి అరెస్ట్‌కు గురైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పరామర్శించేందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రాగా.. ఆయన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కొందరు మఫ్టీలోనున్న పోలీసులు… రఘునందన్‌ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలని రఘునందన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులు, రఘునందన్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులు మాత్రం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈక్రమంలో రఘునందన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్ విషయంలో డీసీపీని కలిసేందుకు వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. మీడియాతో మాట్లాడాక తాను పూర్తిగా పోలీసులకు సహకరిస్తానంటూ చెబుతున్నప్పటికీ వినకుండా బలవంతంగా రఘునందన్‌ను పోలీస్ వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. తన వద్ద తుపాకీ ఉందని… మీ చేష్టల వల్ల మిస్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నా వినకుండా ఆయనను బలవంతంగా వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అటు మహిళా మోర్చా నేతలపైనా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మహిళలని చూడకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తారా? అంటూ మహిళా మోర్చా రాష్ట్ అధ్యక్షురాలు గీతామూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ డీజీపీకి ఫోన్…
భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటో చెప్పాలని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత వెల్లడిస్తామని డీజీపీ సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన కిషన్ రెడ్డి.. ఇంత హంగామా జరుగుతున్నా.. ఏ కేసులో సంజయ్ ను అరెస్టు చేశారో తెలియదా? అని ప్రశ్నించారు. ఇది తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనం. మీరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటెల ఇలా..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అకారణంగా, అక్రమంగా అరెస్ట్ చేసి ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… అరచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి అవినీతి, అక్రమాలు బయటపడకుండా ఆపలేరన్నారు. గతంలో తీన్మార్ మల్లన్న, అంతకు ముందు రఘు.. ఇలా ప్రశ్నించిన జర్నలిస్టులను కూడా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు లీకేజీలు, మరోవైపు ప్యాకేజీలు.. ఇది బయటపడకుండా ఉండడం కోసమే బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. బండి సంజయ్‌ను అరెస్టు చేయడం.. కేసీఆర్ నియంతృత్వానికి ప్రతీక అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వెంటనే బండిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీ బీజేపీ నాయకులు ఇలా స్పందించారు..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. బండి సంజయ్ అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టులు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిందని వీర్రాజు వ్యాఖ్యానించారు.
ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా బండి సంజయ్ అరెస్ట్‌పై తీవ్రంగా స్పందించారు. అక్రమ అరెస్టులు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయిపోయిందని ఫైర్ అయ్యారు.