ఆస్కార్​కి బలగం సినిమా.. దిల్​రాజు క్లారిటీ!

200లకు పైగా సినిమాలు, షోల ద్వారా టాలీవుడ్​ కమెడియన్ గుర్తింపు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం బలగం. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి మంచి విజయాన్నందుకున్నారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ముఖ్యపాత్రల్లో మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మించారు. చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం అందకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగానూ విజయం సాధించింది. తాజాగా బలగం సినిమాని గ్రామాల్లో తెరలు కట్టి వేయడంపై వివాదం రావడం, ప్రముఖుల అభినందనలు, ఇంటర్నేషనల్ అవార్డులు సాధించిన నేపథ్యంలో దిల్ రాజు మరోసారి బలగం సినిమాపై ఓ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు బలగం సినిమాకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడారు. ‘నిర్మాతకు ప్రతి సినిమా ఓ ప్రయోగమే. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ ఎదురైనా తీసుకుంటాము. ఓ ప్రవాహంలా ముందుకెళ్తాము. బలగం సినిమాకు అటు థియేటర్‏లో ,ఇటు ఓటీటీలోనూ మంచి రెవెన్యూ వస్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరముందుకు వచ్చిన బలగం సినిమా ఇంతలా సక్సెస్ అవుతుందని ఊహించలేదు. హర్షిత్, హ‌న్షిత‌లు బ‌ల‌గం సినిమాను రిలీజ్ చేయ‌టానికంటే ముందే పలు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డుల‌కు పంపారు. ఇప్పటికే ఈ సినిమాకు 7 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్స్ వ‌చ్చాయి. అందులో రెండు అవార్డులు డైరెక్ట‌ర్ వేణుకి, ఒక‌టి హీరోకి, ఒకటి హీరోయిన్‌కి, మిగిలినవి సినిమాకు వ‌చ్చాయి. 20 ఏళ్ల‌లో 50 సినిమాలు చేశాను. ఇన్నేళ్లలో ఏ సినిమాకు ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డ్ రాలేదు. ఫ‌స్ట్ టైమ్ దీనికి వస్తున్నాయి. చాలా ఆనందంగా ఉంది. బ‌ల‌గం సినిమాను ఆస్కార్‌కు క‌చ్చితంగా పంపించేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఏదో బ‌డ్జెట్ పెట్టాల‌నే వార్త‌లు వచ్చాయి. నేను కూడా కార్తికేయ‌తో దాని గురించి మాట్లాడాను. నిజానికి యుఎస్‌లో స్ట్రీమింగ్ చేయ‌టానికి కొంత బ‌డ్జెట్ పెట్టాలి. అదే వాళ్లు పెట్టారు. ఆస్కార్ గెలుచుకున్న ఎలిఫెంట్ విస్ప‌ర‌ర్స్​ సినిమా విషయానికి వ‌స్తే వాళ్లేం ఎక్కువగా బ‌డ్జెట్ పెట్ట‌లేదు. అందుకే మేము కూడా బలగం సినిమాని ఆస్కార్ వరకు తీసుకెళ్లాలి అనుకుంటున్నాం’అన్నారు దిల్​ రాజు.

ఇక, తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ వచ్చే వార్తలపై మాట్లాడుతూ.. ‘సినిమా ఇండ‌స్ట్రీతో పాటు అటు రాజ‌కీయ నాయ‌కులు సైతం మా బ‌ల‌గం సినిమాను అభినందిస్తున్నారు. పలువురు రాజకీయ నాయకులు, మా ఊరి నాయకులు నన్ను కూడా రాజకీయాల్లోకి రమ్మంటున్నారు. సినీ పరిశ్రమలోనే ఎవరన్నా ఏమన్నా అంటే నేను తట్టుకోలేను. ఇక రాజకీయాల్లో విమర్శలు చాలా ఎక్కువ. వాటిని నేను తట్టుకోలేను. ప్రస్తుతానికైతే రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు’ అని స్పష్టం చేశారు.