హైదరాబాద్‌లో మోదీ పర్యటన ఇలా..!
అంతర్జాతీయ ప్రమాణాలను తగినట్లుగా.. ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా… అన్ని రకాల సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను పునర్నిర్మాణం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8న ఈ నెల 8న (శనివారం) రెండు గంటల పాటు హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆ రోజు ఉదయాన్నే 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న మోదీ.. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లనున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పనుల కోసం దాదాపు 719 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. సికింద్రబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మోదీ ఉన్నారని.. బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ నెల 8న ఆయన కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే పనులు పూర్తయిన హైదరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ లైన్‌ను మోదీ జాతికి అంకితం చేస్తారు. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గాల నుంచి వెళ్లనున్న వందే భారత్ రైలును ఆయన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచే అయిదు జాతీయ రహదారుల పనుల ప్రారంభం, బీబీనగర్ ఎయిమ్స్ కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. చివర్లో బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక తిరుగుప్రయాణం… 12.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి.