అర్ధరాత్రి బండి సంజయ్ అరెస్టు.. బలవంతంగా తీసుకెళ్లిన పోలీసులు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం అరెస్టుల వరకు వెళ్లింది. మంగళవారం జరిగిన హిందీ పేపర్ వరంగల్‌లో లీకైన విషయం తెలిసిందే. అయితే .. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఓ విలేకరి సహాయంతో బండి సంజయ్‌కు ఆ లీకైన పేపర్ చేరిందని… ఆ తర్వాత అన్ని గ్రూపుల్లో దానిని ఫార్వాడ్ చేశారని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. సుమారు వంద మంది పోలీసులు ఆయన ఇంటిని చేరుకున్నారు. ఈక్రమంలో తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారు? వారెంట్ ఉందా అని పోలీసులను బండి ప్రశ్నించారు. అరెస్టు చేయడానికి ఎలాంటి వారెంటు అవసర్లేదని.. తమకు సహకరించాలని పోలీసులు బండి సంజయ్‌ని కోరారు. ఇది ఇలా ఉండగా.. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున బండి ఇంటికి చేరుకున్నారు. తమ నాయకుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అవేమీ చెప్పకుండా పోలీసులు సంజయ్‌ని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించారు. ఈక్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాటలు చోటుచేసుకున్నాయి.
పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీకి సంబంధించి.. బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్బంగా బండి ఇంటికి కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి… సుమారు 50 మందిపైగా పోలీసులు బండి ఇంటికి వచ్చారు. దాదాపు ఒంటి గంట సమయంలో సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆయన్ని బొమ్మలరామారం పీఎస్‌కి పోలీసులు తరలించారు.
మంగళవారం పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షమైంది. హనుమకొండలోని ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ప్రశాంత్ అనే వ్యక్తి ‘బ్రేకింగ్ న్యూస్’ అంటూ దానిని సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశాడు. హిందీ ప్రశ్నపత్రం లీకైందని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారంటూ బండి సంజయ్‌తోపాటు చాలామందికి దానిని ఫార్వార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే, మంత్రి ఎర్రబెల్లితోపాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ తదితరులతో ప్రశాంత్ దిగిన ఫొటోలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బయట పెట్టారు. ప్రశాంత్ బీజేపీ మనిషంటూ ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడేం చెబుతారంటూ నిలదీశారు. ఇది ఇలా ఉండగా.. వరంగల్ సీపీ రంగనాథ్ పేపర్ లీకు కావడానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ప్రశాంత్ నిన్న ఉదయం నుంచి ఏమేమి చేశాడన్న దానిపై కూపీ లాగారు. ఇందులో బండి సంజయ్ పేరు బయటకు వచ్చింది. నిన్న ఉదయం 9:45కు టెన్త్ హిందీ పేపర్ లీకైంది. 9:59కి ఎస్ఎస్సీ వాట్సాప్ గ్రూప్‌లోకి ఈ పేపర్ వచ్చింది. అక్కడి నుంచి 10:45కి అన్ని గ్రూపుల్లో పోస్టు షేర్ అయ్యింది. పలు మీడియా ప్రతినిధులకు కూడా ప్రశాంత్ పేపర్ పంపాడని.. 11:30కి బండి సంజయ్‌కి కూడా పేపర్ వెళ్లిందని గుర్తించారు. ఈనేపథ్యంలోనే బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.