గంట తర్వాతే హిందీ పేపర్‌ బయటకు వచ్చింది

తెలంగాణలోని వరంగల్‌లో ఇవాళ పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకైన విషయం తెలిసిందే. అయితే అది లీకు కాలేదని.. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత వాట్సప్‌ గ్రూపుల్లో పేపర్‌ వచ్చిందని వరంగల్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ పేపర్‌ ఏవిధంగా బయటకు వచ్చింది అన్న అంశంపై సైబర్‌ క్రైమ్‌ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని సీపీ రంగనాథ్‌ తెలిపారు. పేపర్‌ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే తమకు తెలిసిందన్నారు. ఎగ్జామ్‌ ప్రారంభమైన గంట తర్వాత పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బయటకు వచ్చింది. అంటే.. దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందని.. అది లీక్‌ అనడం సరికాదని.. పేపర్‌ బయటకు వచ్చిందనే తాము భావిస్తున్నట్లు సీపీ వివరించారు. ఒక మీడియా ఛానెల్‌ మాజీ రిపోర్టర్‌ ద్వారా పేపర్‌ సోషల్‌ మీడియాలోకి వచ్చిందని తేలిందని.. అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై లోతైన విచారణ జరుగుతోందన్నారు. సాయంత్రానికి పూర్తి విషయాలు తెలుస్తాయని కమిషనర్‌ తెలిపారు.