వీటిని ప‌చ్చిగా అస్స‌లు తిన‌కండి

పచ్చి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది.. నిజమే! కానీ అన్ని కూరగాయలనూ పచ్చిగా తింటే మంచిది కాదు. అనేక కూరగాయలు, పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవటం చాలామందికి అలవాటు. కానీ కొన్ని కూరగాయల్లో ఒక రకమైన బ్యాక్టీరియా ఉంటుందని, వాటిని ఖచ్చితంగా వండుకునే తినాలని సూచిస్తున్నారు నిపుణులు. పచ్చిగా తినకూడని కూరగాయలేంటో చూద్దాం..
టమాటాలు
ఎర్రగా నిగనిగలాడే టమాటాలను చూడగానే తినేయాలనిపిస్తుంది. చాలామంది తినేస్తారు కూడా. ఇక సలాడ్​, శాండ్​విచ్​లలో పచ్చి టమాటా ముక్కలను విరివిగా వాడతారు. అయితే, వండిన టొమాటోలలో ఉండే లైకోపీన్ దాని పచ్చి రూపంతో పోలిస్తే శరీరం సులభంగా గ్రహించగలదని నిపుణులు చెబుతున్నారు. లైకోపీన్ ఒక ఫైటో-న్యూట్రియంట్, ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
బంగాళదుంపలు
కూరగాయల్లో వంకాయ ఎంత పాపులరో వేపుళ్లలో బంగాళ దుంప వేపుడు అంత ఫేమస్​. అయితే బంగాళ దుంపలను వేయించి, ఉడికించి తినడం మంచిదే కాని పచ్చివి తినకూడదు. సాధారణంగా వీటిని పచ్చిగా తినేందుకు ఎక్కువగా ఇష్టపడరు. కానీ కొన్ని వంటకాల్లో చివరగా బంగాళ దుంపలను సన్నగా తరిగి వాడతారు. అలా వాడటం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది భూగర్భంలో పెరగడం వల్ల విషపూరిత బ్యాక్టీరియా, వైరస్​ ఉండే అవకాశం ఎక్కువ. అంతేకాదు పచ్చిగా తింటే జీర్ణం కావడం కష్టంగా ఉండే అధిక పిండి పదార్ధాలను కూడా కలిగి ఉంటుంది. వండటం వల్ల పిండి విచ్ఛిన్నమై సులభంగా జీర్ణమవుతుంది.
బచ్చలికూర
ఆకుపచ్చ ఆకు కూరలు శరీరానికి చాలా హాని కలిగించే బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. వీటిని సలాడ్‌లలో పచ్చిగా తినడం కంటే ఉడకబెట్టడం ,వేయించి తినడం మంచిది. బచ్చలి కూరను పచ్చిగా తీసుకోవటం ఏమాత్రం సరైంది కాదని చెబుతున్నారు. బచ్చలికూర యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను పెంచుతుంది కాబట్టి దానిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది, కానీ వండుకునే తినాలని సూచిస్తున్నారు నిపుణులు.
క్యారెట్
కరకరలాడే క్యారెట్​లను పిల్లలే కాదు పెద్దలూ ఇష్టంగా తింటారు. అయితే క్యారెట్లు భూమిలో పండడం వల్ల విషపూరితమైన పదార్ధాలను కలిగి ఉండే అవకాశం ఎక్కువ. వాటిని పచ్చిగా తినడం కంటే ఉడికించడం మంచిది. క్యారెట్‌లను ఉడికించడం వల్ల మన శరీరంలో విటమిన్ Aగా మారే యాంటీఆక్సిడెంట్ అయిన బీటా కెరోటిన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయని పరిశోధనల్లో తేలింది. విటమిన్ A కంటి చూపు మెరుగు పరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులను సాధారణంగా ఫిజ్జాలు, బర్గర్​లు, శాండ్​విచ్​లు, సలాడ్​లలో టాపింగ్​లా వాడుతూ పచ్చిగా తింటారు. కానీ అవి దృఢమైన కణ గోడలను కలిగి ఉండి అంత త్వరగా జీర్ణం కావు. వాటిని ఉడికించడం వల్ల కణ గోడలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా, పుట్టగొడుగులు ప్రోటీన్, బి విటమిన్లు మరియు ఖనిజాలను కలిగి ఉన్న అన్ని పోషకాలను విడుదల చేయడానికి సహాయపడతాయి. అందువల్ల పుట్ట గొడుగులను ఉడికించి తింటేనే ఫలితం ఉంటుంది.
కాలీఫ్లవర్‌
సలాడ్​లలో ఎక్కువగా తినే వాటిలో ఇదీ ఒకటి. పచ్చిగా ఎక్కువ మంది తింటారు, అయితే ఈ క్రూసిఫరస్ కూరగాయలు వాటి సహజ స్థితిలో సులభంగా జీర్ణం కావు. ఉడకబెట్టడం వల్లే ఇది మంచి ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ పోషకాలను విడుదల చేస్తుంది. కాలీఫ్లవర్‌లో కాలేయాన్ని శుభ్రపరిచే ఎంజైమ్‌లను నిలుపుకోవటానికి, సాఫీగా జీర్ణమయ్యేలా చేయడానికి ఉడికించిన తరువాత తీసుకోవటం మంచిది. ఏ కూరగాయలనైనా ఆహారంలో వినియోగించే ముందు శుభ్రం చేయడం తప్పనిసరి.