కోవిడ్‌, గుండెపోటుకు లింక్.. ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

ఈ మ‌ధ్య‌కాలంలో వ‌య‌సులో సంబంధం ఎంద‌రో గుండెపోట్ల కార‌ణంగా మృత్యువాత‌ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కొంద‌రేమో కోవిడ్ వ్యాక్సిన్ కార‌ణంగా ఈ హార్ట్ ఎటాక్‌లు సంభ‌విస్తున్నాయ‌ని ఆరోపిస్తుంటే మ‌రికొందరేమో కోవిడ్ సోకిన‌వారికి ర‌క్తం చిక్క‌బ‌డి ఈ హ‌ఠాన్మ‌ర‌ణాలకు దారితీస్తున్నాయ‌ని అంటున్నారు. ఇదే విష‌య‌మై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాందవ్యా స్పందించారు. గ‌త నాలుగు నెల‌లుగా భార‌త్‌లో మ‌ళ్లీ కోవిడ్ కేసులు విచ్చ‌ల‌విడిగా పెరుగుతండ‌డంతో దానిని ఎదుర్కొనేందుకు స‌రిప‌డా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు, ఐసీయూ బెడ్స్, ఇత‌ర అత్య‌వ‌స‌ర సామాగ్రిని ఏర్పాటుచేసామ‌ని తెలిపారు. కోవిడ్ కేసుల‌పై ప్ర‌తి వారం రివ్యూ మీటింగ్‌లు జ‌రుపుతున్నామ‌ని పేర్కొన్నారు.  కోవిడ్ ఎప్పుడు ఎలా విరుచుకుప‌డుతుందో చెప్ప‌లేమ‌ని, వివిధ మ్యుటేష‌న్ల‌కు గురై మ‌ళ్లీ వ్యాపిస్తోంద‌ని ఆందోళ‌న వ్యక్తం చేసారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ‌మంది యువ‌తో సంభ‌విస్తున్న గుండెపోట్ల‌కు కోవిడ్‌కు ఏమైనా సంబంధం ఉందేమోన‌న్న విషయంపై రీసెర్చ్ చేయాల‌ని సూచించిన‌ట్లు తెలిపారు. రీసెర్చ్‌కు సంబంధించిన ఫ‌లితాలు రావ‌డానికి మూడు నెల‌లు ప‌డుతుంద‌ని అన్నారు.

ఇక ఇప్పుడిప్పుడు ఎక్కువ అవుతున్న కోవిడ్ కేసుల గురించి ఆయ‌న స్పందిస్తూ.. “భ‌య‌ప‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ జాగ్ర‌త్త‌ప‌డాలి. ఇప్పుడు వ‌చ్చిన కొత్త వేరియంట్‌ను XBB1.16గా గుర్తించాం. అయితే కోవిడ్ లాగా ఈ స‌బ్ వేరియంట్స్‌కు అంత‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇవి అంత డేంజ‌ర‌స్ కావు. కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిన‌ప్పుడ‌ల్లా న‌మూనాలు సేక‌రించి ల్యాబ్‌లో భ‌ద్ర‌ప‌రిచి రీసెర్చ్ చేస్తున్నాం. ఆ త‌ర్వాత వాటిని అంత‌మొందించేందుకు వ్యాక్సిన్ల ప్ర‌భావం ఎంత‌గా ఉంటుంద‌ని ప‌రిశీలిస్తాం. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన వేరియంట్ల‌ను మ‌న వ్యాక్సిన్లు బాగానే ఎదుర్కొన్నాయి. ఇప్పుడు చింతించాల్సిన అంశం ఏంటంటే.. ఎంద‌రో సెల‌బ్రిటీలు, యువ‌కులు చిన్న వ‌య‌సులోనే గుండెపోట్ల‌తో మ‌ర‌ణించారు. ఇది దిగ్భ్రాంతికి గురిచేసే విష‌యం. అందుకే అనుమానంతో నాలుగు నెల‌ల క్రిత‌మే గుండెపోటుకు కోవిడ్‌కు ఏమైనా లింక్ ఉందా అన్న విష‌యంపై ICMR ప‌రిశోధ‌న‌లు చేస్తోంది. ఇంకో మూడు నెల‌ల్లో ఫ‌లితాలు రాగానే వెల్ల‌డిస్తాం” అని తెలిపారు.