Sania Mirza: హైద‌రాబాద్ నుంచి సానియా పోటీ?

Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌బోతున్నారా? అవున‌నే టాక్ వినిపిస్తోంది. ఈ లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha Elections) ఆమె తెలంగాణ నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సానియాను హైద‌రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈరోజు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కాంగ్రెస్ హైక‌మాండ్‌తో మీటింగ్ నిమిత్తం ఢిల్లీ వెళ్ల‌నున్నారు. అక్క‌డ సానియా మీర్జాకు టికెట్ ఇవ్వాలా వ‌ద్దా అనే అంశంపై చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మాజీ క్రికెట‌ర్ అజ‌హ‌రుద్దిన్ సానియాను బ‌రిలోకి దింపితే బాగుంటుంద‌ని కాంగ్రెస్‌కు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించార‌ట‌. అజ‌హ‌రుద్దిన్‌కు సానియా మీర్జా కుటుంబంతో మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. అజ‌హ‌రుద్దిన కుమారుడు అస‌దుద్దిన్ వివాహం.. 2019లో సానియా చెల్లెలు అన‌మ్‌తో జ‌రిగింది. హైద‌రాబాద్ ఎంపీ సీటు MIM పార్టీ అధినేత అస‌దుద్దిన్ ఒవైసీ (Asaduddin Owaisi) కంచుకోట‌గా ఉంది. ఈసారి అస‌దుద్దిన్‌ని ఓడించేందుకు స్ట్రాంగ్ అభ్య‌ర్ధి ఉంటే బాగుంటుంద‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తోంద‌ట‌.

చివ‌రిసారిగా కాంగ్రెస్ హైద‌రాబాద్‌లో గెలిచింది 1980లో. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి కేఎస్ నారాయ‌ణ్ పోటీ చేసి గెలిచారు. 1984లో సుల్తాన్ స‌లాహుద్దిన్ ఒవైసీ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత సుల్తాన్ MIMలో చేరి 1989 నుంచి 1999 వ‌ర‌కు హైద‌రాబాద్ ఎంపీగా గెలుస్తూ వ‌చ్చారు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ ఎంపీగా పోటీ చేసిన అస‌దుద్దిన్ 517,471 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఫెరోజ్ ఖాన్ మాత్రం 49,944 ఓట్లతో ఓడిపోయారు.