కదిలే ట్రైన్‌ ఎక్కే పందెం.. మిగిల్చింది వైకల్యం!

టీనేజ్‌లో ఉండే యువత తెలిసీ తెలియక.. అనేక ఛాలెంజ్‌లు చేస్తూ.. ఇటీవల ప్రాణాలు పొగొట్టుకుంటున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. రైలు వస్తుండగా.. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటూ.. రీల్స్‌ అంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వార్తలు ఎన్నో రోజూ చూస్తున్నాం. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కదిలే రైలు ఎక్కాలని పందెం వేసుకున్నారు. అప్పటి వరకు వారు గుడివాడ రైల్వే స్టేషన్‌ సమీపంలో క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఈక్రమంలో ఓ గూడ్స్‌ రైలు దూరం నుంచి రావడం చూశారు. దాన్ని ఎక్కాలని వేగంగా ఇద్దరూ పట్టాల వైపు పరుగులు తీశారు. ఆ రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు ఒకరు చక్రాల కింద పడిపోయాడు. దీంతో కాలుపై రైలు చక్రం వెళ్లడంతో ఓ కాలు విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆకతాయిగా వేసుకున్న పందెం కాస్త.. అతనికి వైకల్యాన్ని మిగిల్సించింది. దీంతో తమ బిడ్డ భవిష్యత్తు ఇలా అయ్యిందేమిటని.. యువకుడి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. సరదా కోసం చేసిన స్టంట్‌ కాస్తా చివరికి కాలు పోయేలా చేయడం గుడివాడలో కలకలం రేపింది.

ఆకతాయి వేషాలతో తల్లిదండ్రులకు బాధలు..
నేటి తరం పిల్లలు తల్లిదండ్రుల మాట బొత్తిగా వినని పరిస్థితి ఉంది. పనికొచ్చే పనికంటే.. సరదాగా, ఆకతాయి చేస్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. గుడివాడ రైల్వే స్టేషన్‌లో నిన్న జరిగిన ఘటన కూడా అలాంటిదే… సరదాగా పందెం వేసుకున్న ఘటన కాస్త.. విద్యార్థి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. వాళ్లు వేసుకున్న పరుగు పందె పోనే ఏ గోల్డ్‌ మెడల్‌ కోసమో లేదా… కోట్లు వచ్చేదో అంటే అది కూడా కాదు. ఇప్పుడు చివరికి కాలు పోగొట్టుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఓ విద్యార్థి. కనీసం ఇలాంటి ఘటనలు చూసైనా మిగిలిన వారు అలెర్టుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.