సల్మాన్​ ఖాన్​ సినిమాలో మెగా పవర్​ స్టార్​!

బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ తాజాగా నటిస్తున్న సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. హిందీతోపాటు తెలుగు భాషలోనూ రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​ కాగా, విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజైన బతుకమ్మ సాంగ్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పాటలో మన బతుకమ్మ, సంస్కృతి, సంప్రదాయాల్ని చక్కగా చిత్రీకరించారు. ఈ క్రమంలోనే ‘ఏంటమ్మా’అంటూ సాగే మరో సింగిల్‌ను ఈరోజు అంటే ఏప్రిల్ 4న విడుదల చేయనున్నారు. తాజాగా రిలీజ్​ చేసిన ఈ సాంగ్ టీజర్‌లో వెంకటేష్, సల్మాన్ ఖాన్ లుంగీ గెటప్‌లో డాన్స్ చేస్తుండగా.. వారితో మూడో వ్యక్తి జాయిన్ అయినట్లు చూపించారు. కానీ ఆ మూడో వ్యక్తి ఎవరో మాత్రం చూపించలేదు. అయితే, ఆయన ఎవరో నెటిజన్లు కనిపెట్టేసి కామెంట్​ చేస్తున్నారు. అది కచ్చితంగా మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ అంటూ సంబరపడిపోతున్నారు టాలీవుడ్​ ప్రేక్షకులు.
సల్మాన్​ ఖాన్​ హీరోగా రూపొందుతున్న‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమా హిందీ, తెలుగు వెర్షన్‌కు సంబంధించిన ఫ్యూజన్ సాంగ్ టీజర్‌ను సోమవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు మేకర్స్​. ఇక, ఈ టీజర్​లో డాన్స్ చేస్తున్న సల్మాన్, వెంకీలతో ఒక మిస్టరీ మ్యాన్ కలుస్తుండగా కట్​ అయ్యింది. అయితే అతను మరెవరో కాదు RRRతో గ్లోబల్​ స్టార్​గా మారిన మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ అని తెలుస్తోంది. ‘ఏంటమ్మ’ డాన్స్ నంబర్‌లో చరణ్.. ఈ ఇద్దరు సీనియర్ హీరోలతో డాన్స్ ఫ్లోర్‌ను దడదడలాడించాడని టాక్. కాగా ఫుల్ సాంగ్‌ను ఏప్రిల్ 4న విడుదల చేయనున్నారు.
ఈ ‘ఏంటమ్మా’ పాటని పాయల్ దేవ్ కంపోజ్ చేయగా, విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ పాడారు. అంతేకాదు షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజ్ చేయడం విశేషం. తాజాగా విడుదలైన బతుకమ్మ పాటను కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. కలర్‌ఫుల్ కొరియోగ్రఫీ కలిగిన ఈ సాంగ్‌లో సల్మాన్, పూజా హెగ్డే, వెంకటేష్, భూమిక చావ్లా కనిపించారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ చిత్రంలో జగపతి బాబు, విజేందర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, వినాలి భట్నాగర్ తదితరులు నటించారు. యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ వంటి అన్ని ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం రంజాన్​ సందర్భంగా ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను జీ స్టూడియోస్ వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనుంది.