Sadhguru: మీ దాకా వస్తే కానీ తెలీలేదా సద్గురూ..?
Sadhguru: ప్రముఖ ఆధ్యాత్మిక తత్వవేత్త, ఇషా ఫౌండేషన్ సంస్థ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. మార్చి 17న సద్గురుకు విపరీతమైన తల నొప్పి వచ్చింది. దాంతో ఆయన్ను ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేయగా.. మెదడు వాచిందని అందుకే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యిందని తెలిపారు. వెంటనే సర్జరీ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు. దాంతో నిన్న సద్గురుకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన బాగానే కోలుకుంటున్నారు.
అయితే ఇప్పుడు సద్గురు త్వరగా కోలుకోవాలి అంటూనే ఆయనపై ట్రోల్స్ వస్తున్నాయి. అలోపతి మెడిసిన్ అనేది కెమికల్ మాత్రమే అని ఏ చికిత్సకైన ఆయుర్వేదమే ఎంతో మంచిదని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఎందుకు ఆయుర్వేదిక్ చికిత్స తీసుకోకుండా హాస్పిటల్లో చేరారు అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. “” ఆయుర్వేదము గొప్పదే, అలోపతి గొప్పదే. కాకపోతే వ్యాపారాల కోసం మరొక దాన్ని తగ్గించి, సమస్య రాగానే ప్రజలకి చెప్పిన సొల్లంతా పక్కన పడేసి వెళ్లి హాస్పిటల్లో చేరుతారు చూడు అప్పుడు అనిపిస్తుంది, వీళ్లేమీ మహాత్ములు కాదు మీడియా, రాజకీయ అండతో ఎదిగిన స్వామీజీల ముసుగులో ఉన్న సాధారణ మనుషులే అని “” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.