ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదు – సీఎం జగన్‌

ఏపీలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చ.. ముందస్తు ఎన్నికలకు సీఎం జగన్‌ వెళ్లనున్నారని, దీంతోపాటు మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని అందరూ అనుకుంటున్నారు. కానీ అవన్నీ రూమర్లేనని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో ఇవాళ జరిగిన సమీక్షలో పలు విషయాలను ఎమ్మెల్యేకు తెలియజేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష ఉంటుందని వైసీపీ వర్గాలు చెప్పినప్పటికీ.. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల పరిణామాలు, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ఎమ్మెల్యేలు ముందుకు పోవాలి, ఈ నెల 7 నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమం వంటి వాటిపై ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు సీఎం స్పష్టం చేశారు. మంత్రుల మార్పులతో సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయని.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపై తొలిసారి స్పందించిన జగన్‌..
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన చాలా రోజుల తర్వాత సీఎం జగన్‌ స్పందించారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలను ఆయన దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని టీడీపీ ప్రగల్బాలు పలుకుతోందని.. 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందని సీఎం పేర్కొన్నారు. ‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి, ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్ముల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారని’ సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో… వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ ఉంటారని.. అందులోనూ కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారని ఆయన తెలిపారు. మిగిలిన 80 శాతం మంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదన్నారు. ఇది ఏ రకంగానూ రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవ్వదన్నారు. అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేదని.. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉంది కాబట్టి గెలవగలిగిందన్నారు. వాపును చూపించి.. అది బలం అని చెప్పుకుంటున్నారని టీడీపీని ఉద్దేశించి సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

సమావేశానికి పలువురు గైర్హాజరు..
సీఎం జగన్ ఇవాళ వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడదల రజని, ఆళ్ల రామకృష్ణారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ద్వారకానాథరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గం చెబుతోంది. ఇక బుగ్గన కొవిడ్ బారినపడినట్టు సమాచారం. ఈ నెల 6న సీఎం జగన్ చిలకలూరిపేట నియోజకవర్గంలో పర్యటించనుండగా, ఆయన పర్యటన కార్యక్రమాల సమీక్షలతో విడదల రజని బిజీగా ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వైసీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సీఎం సమీక్ష సమావేశంలో కనిపించలేదు. ఆయన పులివెందులలో ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ శ్రీనాథరెడ్డి పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే కేతిరెడ్డి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ హాజరు కావాల్సిందేనని.. ఆయన్ని సమావేశానికి పిలిపించినట్లు సమాచారం.