Unemployment: దానికంటే ఉద్యోగం చేయకపోవడమే బెటర్ అంటున్న యువత
Unemployment: ఇప్పుడు ఉద్యోగాల వ్యవస్థ ఒకప్పటిలా లేదు. ఒకప్పుడు కనీసం గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు చాలా కంపెనీల్లో గౌరవంతో పాటు జీతం కూడా సరిగ్గా ఇవ్వడంలేదు. పెరుగుతున్న ఖర్చులు, అవసరాలను దృష్టిలో పెట్టుకున్న మిలీనియల్స్ (1980 నుంచి 1990ల్లో జన్మించినవారు) కూడా యాజమాన్యం తిడితే పడి ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇప్పుడు చదువుకున్న యువత ఆలోచనా విధానం అలా లేదట.
లఖ్నౌకి చెందిన ఐఐఎంతో పాటు మరికొన్ని యూనివర్సిటీలు చేసిన సర్వేలు ఏం చెప్తున్నాయంటే.. మన భారతదేశం సరైన సంఖ్యలో ఉద్యోగాలు కల్పించకుండా తక్కువ ఉద్యోగాల్లో ఎక్కువ మందిని చేర్చుకుంటున్నాయట. దీని వల్ల వారికి జీతాలు తక్కువ ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటున్నట్లు నివేదికలో తేలింది. జాతీయ సాంపుల్ సర్వే ఆఫీస్ (NSSO) నుంచి సేకరించిన డేటా ప్రకారం.. 2004 నుంచి 2005 వరకు 2011 నుంచి 2012 వరకు అసలు ఉద్యోగాల్లో ఎలాంటి అభివృద్ధి లేదని తేలింది.
ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఇప్పటికీ నిరుద్యోగం అలాగే ఉంది. ఆడవారికి అవకాశాలు రావడంలేదు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు దొరకడంలేదు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య విలువ పెరిగిపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పెద్ద చదువులపై ఫోకస్ చేస్తున్నారు. దాంతో వారు తక్కువ జీతాలు ఇచ్చే ఉద్యోగాలు చేయాలనుకోవడం లేదు. చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరకనప్పుడు అసలు ఉద్యోగం చేయకపోవడమే మంచిది అని 15 నుంచి 29 ఏళ్ల వయసు వారు ఆలోచిస్తున్నట్లు నివేదికలో తేలింది.