YS Sharmila: అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడు

YS Sharmila: దివంగ‌త నేత వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో స్మార‌కోత్స‌వం సంద‌ర్భంగా APCC చీఫ్ వైఎస్ షర్మిళ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌న బాబాయ్ గురించి గుర్తు చేసుకుంటూ ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు.

“” అన్నా అని పిలిపించుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉన్నాడు. చెల్లెళ్ళ మీద ఎన్ని అభాండాలు వేసినా తట్టుకున్నాం. సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి, ధర్మ పోరాటానికి నేను అండగా ఉంటా. ఈ గడ్డ సాక్షిగా మాట ఇస్తున్న. సునీత వెనుక నేనున్నా. ఇది ఆస్తి కోసం,అంతస్తు కోసం జరిగే పోరాటం కాదు. న్యాయం కోసం జరుగుతున్న పోరాటం. ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను ఛీ కొట్టాలి. హంతుకుల పక్షాన నిలబడ్డ వారికి ఒక గుణపాఠం నేర్పాలి.

వైఎస్ వివేకా ఒక మంచి మనిషి. వివేకాది అద్భుతమైన వ్యక్తిత్వం. అందరికీ సహాయపడే గుణం. నన్ను ఎత్తుకొని తిరిగిన వ్యక్తి మా చిన్నాన్న. సునీత నేను కలిసే పెరిగాం. చిన్నాన్న ఎప్పుడు చికాకు పడలేదు. కోపం రాదు. సహాయం అని అడిగితే వెంట పెట్టుకొని మరి తీసుకొని వెళ్ళే వాడు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉండేవాడు. చిన్నాన్న నన్ను ఆఖరిగా కలిశాడు. ఎంపీగా పోటీ చేయాలని అడిగాడు. నేను వద్దు అన్నా వినలేదు. నన్ను ఒప్పించుకొని మరి వెళ్ళాడు. చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లు గడించింది. ఇప్పటికీ చిన్నాన్న మరణం నమ్మలేని నిజం. రాజకీయ విష సర్పాల కోరల్లో చిక్కుకుని.. దుర్మార్గపు పాలన చక్రాల కింద నలిగి..న్యాయం కోసం ధర్మం కోసం పోరాటం చేస్తున్న ఒక నిప్పులాంటి నిజం. క్రూరాతి క్రూరంగా హత్య చేశారు. దారుణంగా నరికి చంపారు. వివేకా సమాజంలో పెద్ద మనిషి. వైఎస్సార్‌కి ప్రియమైన తమ్ముడు. అలాంటి వ్యక్తి హత్య విషయంలో ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఈనాటికీ శిక్ష పడలేదు. (YS Sharmila)

అంతటి వ్యక్తికే న్యాయం జరగలేదు అంటే…సమాజంలో మిగతా వారి పరిస్థితి ఎంటి ? ఇప్పటి వరకు దోషులను గుర్తించాలి. చిన్నాన్న హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు అని చెప్పారు. సాక్షి కూడా ఇదే విధంగా కవరేజ్ ఇచ్చింది. ఇక్కడకు వస్తేగాని అసలు విషయం తెలియలేదు. చిన్నాన్న హత్య అని ఇక్కడకు వచ్చాకే తెలిసింది. హత్య ఎవరు చేశారో అప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలుసు. బంధువులే హత్య చేశారు అని అందరికీ తెలుసు. ఎవరు చేశారో అందరికీ తెలుసు. వేలు ఎత్తి వీళ్ళే అని చూపుతున్నా చర్యలు లేవు. కేసు ముందడుగు పడలేదు. అన్న‌ అని పిలిపించుకున్న వాడే హంతులకు రక్షణ గా ఉన్నాడు. అందుకే ఇవ్వాళ్టి వరకు చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదు.

వివేకా హత్యతో సునీత, సౌభాగ్యమ్మ ఇద్దరికీ నష్టం జరిగింది. న్యాయం చేయాల్సింది పోయి సునీత హత్య చేసింది అని చెప్తున్నారు. మీరు ఒకసారి అద్దం ముందు నిలబడండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుంది చూడండి. సాక్షిలో పైన వైఎస్సార్ ఫోటో… కింద సాక్షిలో వివేకా క్యారెక్టర్ మీద నిందలు. చనిపోయే వరకు మీకే సేవ చేశారు. మీకోసమే ఎన్నికలో పని చేశారు.  మీకోసం పని చేస్తే నిందలు వేస్తారా ? సోషల్ మీడియాలో బెదిరించారు. బూతులు తిట్టారు. తోడ బుట్టిన చెల్లెల్లు అని చూడకుండా అవమానాలకు గురి చేశారు. అన్నింటికీ తట్టుకున్నాం. న్యాయం కోసం సునీత తిరగని చోటు లేదు.. తట్టని గడప లేదు. సునీత కుటుంభం హత్య చేసి ఉంటే ..మీరు సునీత ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ? సునీత కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు?

హత్య ఎవరు చేశారో మీకు తెలుసు. అందుకే మీకు ధైర్యం రాదు. సునీత వైఎస్సార్ తమ్ముడు బిడ్డ. సునీతను వైఎస్సార్ ఎలా చూసుకున్నాడు మీకు తెలియదా ? సునీత ఒక డాక్టర్. సునీత ఒక డాక్టర్‌గా తనకంటూ ఒక స్థానం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు ఉంది. సునీతను చూసిన ప్రతి సారి నా గుండెల్లో అంతులేని బాధ గుర్తుకు వస్తుంది. అంతే స్థాయిలో ఉద్రేకం..న్యాయం జరగలేదు అని. సునీతకు..చిన్నమ్మకి మాట ఇస్తున్నా. ఎవరు ఉన్నా లేకున్నా…వైఎస్సార్ బిడ్డ మీకు అండగా ఉంది. (YS Sharmila)

సునీత పోరాటానికి నేను బ‌లం అయితే హంతులకు శిక్ష పడాలని చేస్తున్న ధర్మ పోరాటంలో నేను ఒక ఆయుధం అవుతా. నేను ఈ మట్టిమేదే పుట్టా. ఈ గడ్డ సాక్షిగా మాట ఇస్తున్నా. సునీత వెనుక వైఎస్ షర్మిలా రెడ్డి ఉంది. ఇది ఆస్తి కోసం, అంతస్థుల కోసం కాదు..న్యాయం కోసం. న్యాయం జరగాలని కొట్లాడుతున్న బిడ్డ కోసం. చిన్నాన్న ఆత్మ శాంతి చేకూరే వరకు ఈ పోరాటం ఆగదు. ప్రజలు అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. న్యాయం పక్షాన నిలబడాలని ఒక నిర్ణయం తీసుకోవాలి. హత్యా రాజకీయాలను ఛీ కొట్టాలి. హంతకుల పక్షాన నిలబడుతున్న వారికి ఒక గుణపాఠం కావాలి. నిజం గెలవాలి “” అని తెలిపారు ష‌ర్మిళ‌