BS Yediyurappa: షాకింగ్.. మాజీ సీఎంపై లైంగిక వేధింపుల కేసు
BS Yediyurappa: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించినట్లు ఓ 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని సదాశివ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఓ చీటింగ్ కేసు విషయం గురించి యడ్యూరప్పతో మాట్లాడేందుకు ఓ మహిళ ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తన 17 ఏళ్ల కుమార్తెను కూడా వెంట తీసుకెళ్లింది. ఆ సమయంలోనే యడ్యూరప్ప బాలికను బలవంతంగా గదిలోకి ఈడ్చుకెళ్లి లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఆ బాలిక తప్పించుకుని తన తల్లితో విషయం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
దీనిపై యడ్యూరప్ప అధికారిక కార్యాలయం స్పందించింది. ఆ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని గతంలో కూడా 53 ఫిర్యాదులు చేసిందని పేర్కొంది. వారికి ఇలా కావాలనే ఫిర్యాదులు చేయడం అలవాటని తెలిపింది. 2007లో యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రిగా ఏడు రోజులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత 2008 నుంచి 2011 వరకు పూర్తి స్థాయి సీఎంగా ఉన్నారు. 2018 మేలో మళ్లీ మూడు రోజుల సీఎంగా ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసారు.