Movie Reviews: ఇక సినిమా రిలీజైన 48 గంట‌ల త‌ర్వాతే రివ్యూ

Movie Reviews: ఈ మ‌ధ్య‌కాలంలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్ర‌తి ఒక్క‌డూ రివ్యూలు ఇచ్చేవాడు అయిపోయాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్‌కి విప‌రీత‌మైన డిమాండ్ పెరిగిపోతుండడంతో ఏద‌న్నా సినిమా రిలీజ్ అవ్వ‌గానే రివ్యూలు చెప్తాం అంటూ నోటికి ఏదొస్తే అది వాగేస్తున్నారు. కొంద‌రేమో డబ్బులు ఇస్తే సినిమాకు మంచి రివ్యూ చెప్తామ‌ని అంటున్నారు. మ‌రికొంద‌రు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోతే ఆ సినిమా అష్ట ద‌రిద్రంగా ఉందంటూ ప్రేక్ష‌కుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. నిజానికి మ‌న ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌లో నిజాయ‌తీగా సినిమా రివ్యూలు ఇచ్చేవారి సంఖ్య త‌గ్గిపోయింద‌నే చెప్పాలి. ఫేక్ రివ్యూవ‌ర్స్ వ‌ల్ల సినిమా న‌ష్ట‌పోతోందని భావించి కేర‌ళ హైకోర్టు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈసారి సినిమా రిలీజ్ అయిన 48 గంట‌ల త‌ర్వాతే రివ్యూలు ఇవ్వాల‌ని అంత‌కంటే ముందు ఇవ్వ‌కూడ‌ద‌ని ఆదేశించింది.

కేర‌ళ హైకోర్టు సినిమా రివ్యూల విష‌యంలో ఎమిక‌స్ క్యూరేయ్‌కి ఆదేశించింది. ఎమిక‌స్ క్యూరేయ్ అంటే వేరొక‌రు కేసు కానీ పిటిష‌న్ కానీ వేయ‌కుండా కోర్టే సొంతంగా స‌మాచారం సేక‌రించి క్షుణ్ణంగా ప‌రిశీలించి ఆ అంశంపై ఓ తీర్పు వెల్ల‌డిస్తుంది. రివ్యూ బాంబింగ్స్‌కు పాల్ప‌డేవారిపై చ‌ర్య‌లు తీసుకునేలా ఓ సైబ‌ర్ సెల్‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించింది. ఈ సెల్ ద్వారా సినిమా రిలీజ్ అయిన రోజున కానీ 48 గంట‌ల లోపు కానీ రివ్యూలు ఇస్తే వారిపై ఎవ‌రైనా ఫిర్యాదులు చేయొచ్చు.

రివ్యూ ఇచ్చేవారు కూడా నిర్మ‌ణాత్మ‌క‌మైన రివ్యూలు మాత్ర‌మే ఇవ్వాలి కానీ అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం వాడ‌టం.. కావాల‌ని హీరో హీరోయిన్లు ద‌ర్శ‌కుల‌ను టార్గెట్ చేస్తూ రివ్యూలు ఇచ్చినా నేర‌మే అని కోర్టు తేల్చి చెప్పింది. 2023 అక్టోబ‌ర్‌లో ర‌హేల్ మ‌కెన్ కోరా అనే ద‌ర్శ‌కుడు కొంద‌రు కావాల‌నే త‌న సినిమాపై నెగిటివ్ ప్ర‌చారం చేస్తున్నార‌ని ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. ఈ నేప‌థ్యంలో కేర‌ళ హైకోర్టు దీనిని సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించి ఎమిక‌స్ క్యూరేయ్‌కి ఆదేశించింది. (Movie Reviews)