నేటి నుంచే ఏపీలో ఒంటిపూట బడులు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఈక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. నేటి నుంచి అనగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలంగాణలో మాత్రం మార్చి 15వ తేదీ నుంచే ఒంటిపూట బడలు అక్కడ కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు ఏపీ, తెలంగాణలో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీనికోసం అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పేపర్‌ లీకేజీతో ఆయా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసు వ్యవస్థను కూడా కేంద్రాల వద్ద ఉంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. అదేవిధంగా హాల్‌ టికెట్‌ చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రెండు రాష్ట్రాల మంత్రులు చెబుతున్నారు.

ఏపీలో ఒంటిపూట బడుల వేళలు ఇలా..
ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వాతావరణ శాఖ నివేదిక ఆధారంగా ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నట్లు బొత్స స్పష్టం చేశారు. దీంతోపాటు పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో పూర్తిగా సెలవులు ప్రకటించారు. అక్కడ ఎలాంటి తరగతులు నిర్వహించరని తెలిపారు. ఇక ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రోజు మార్చి రోజు జరుగుతాయి. మరో ప్రత్యేకం ఏంటంటే.. అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది అంధ విద్యార్థినులు సహాయకులు అవసరం లేకుండా.. డిజిటల్‌ విధానంలో పరీక్షలు రాసేందుకు సన్నద్దం అవుతున్నారు. ఇలా పరీక్ష రాయడం దేశంలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం.