ఇండియన్​ మైఖెల్​ జాక్సన్​ ప్రభుదేవా బర్త్​డే స్పెషల్​!

ప్రభుదేవా.. కొరియోగ్రాఫర్​, యాక్టర్​, డైరెక్టర్, నిర్మాత, డ్యాన్సర్​ మాత్రమే కాదు. డ్యాన్స్​ని కెరీర్​గా ఎంచుకున్న లక్షలాది మందికి ఒక స్ఫూర్తి. మనదేశంలో చెప్పుకోదగిన అతి కొద్దిమంది డ్యాన్సర్స్​లో ప్రభుదేవా ఒకరు. ప్రముఖ డ్యాన్స్​ మాస్టర్ సుందరం​ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభుదేవా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్​ చేసుకుని ప్రత్యేకంగా నిలిచారు. కొరియోగ్రాఫర్​గానే కాకుండా నటుడు, దర్శకుడిగానూ తనలోని ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రొడ్యూసర్​గానూ మూడు తమిళ సినిమాలను నిర్మించారు. సినీ పరిశ్రమలోని టాప్​ హీరోలందరితో స్టెప్పులేయించిన ప్రముఖ కొరియోగ్రాఫర్​ సుందరం మాస్టర్​ కొడుకులైన ప్రభుదేవా, రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్​ ముగ్గురూ డ్యాన్స్​ మాస్టార్లే. కొరియోగ్రాఫర్​గా కెరీర్​ ప్రారంభించిన ప్రభుదేవా తన ప్రతిభతో భారతదేశ నాలుగవ అత్యున్నత పైర పురస్కారమైన పద్మశ్రీ అందుకున్నారు. కమల్​ హాసన్​ నటించిన ఇండియన్ సినిమాలోని​ ‘చికు బుకు చికు బుకు రైలే..’ అంటూ డ్యాన్స్ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన ఇండియన్​ మైఖెల్​ జాక్సన్ ప్రభుదేవా పుట్టినరోజు (ఏప్రిల్​ 3న) సందర్భంగా ప్రత్యేక కథనం..

ప్రభుదేవా కర్నాటక-చెన్నై సరిహద్దులోని మైసూరులో 1973 సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన జన్మించారు. ఈయన తల్లిదండ్రులు మహదేవమ్మ, సుందరం మాస్టర్. చిన్నతనంలో ప్రభుదేవాకు డ్యాన్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదట. ఆయనకు ఫుట్ బాల్ అంటే చాలా ఇష్టముండేదట. అయితే తన తండ్రి ప్రేరణతో డ్యాన్స్ లో అడుగుపెట్టిన ప్రభుదేవా చిన్నప్పుడే భరత నాట్యంలో శిక్షణ పొందారు. అంతేకాదు వెస్ట్రన్ స్టైల్ లో కూడా చక్కగా రాణించారు. అతని స్టెప్పులు మెచ్చిన చాలామంది ‘ఇండియన్ మైఖేల్ జాక్సన్’అని బిరుదు ఇచ్చేశారు. అనుకోకుండా డ్యాన్స్​నే కెరీర్​గా ఎంచుకుని దేశం గర్వించేస్థాయికి ఎదిగారు ప్రభుదేవా.
మొదటి సినిమా
ప్రభుదేవా తన పదహారేళ్ల వయసులో అంటే 1989లో కమల్ హాసన్ నటించిన వెత్రి విజా సినిమా ద్వారా కొరియోగ్రాఫర్​గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇప్పటివరకు సుమారు వంద సినిమాలకు పైగా కొరియోగ్రాఫర్ గా చేశారు. ప్రభుదేవా కేవలం డ్యాన్స్ చేస్తూ కొరియాగ్రాఫర్ గా ఆగిపోలేదు. ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. 1994లో ఇందు అనే చిత్రం ద్వారా వెండితెరకు నటుడిగా పరిచమయ్యారు. ఈ చిత్రానికి పవిత్రన్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా రోజా నటించారు. మొదటి సినిమాలోనే తనలోని నట విశ్వరూపం చూపించారు ప్రభుదేవా. అందుకే ఆ చిత్రం నాలుగు జాతీయ అవార్డులను గెలుచుకుంది.
బాలీవుడ్​ కల
ప్రభుదేవాకు కెరీర్​ ఆరంభం నుండీ ఓ కల ఉండేదట. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్​లోనూ అడుగుపెట్టాలనీ, బిగ్​ బీ అమితాబ్ బచ్చన్​తో కలిసి పని చేయాలని కలగనే వారట. అయితే ఆ కలను తన ప్రతిభతో నిజం చేసుకున్నారు. అంతేకాదు సల్మాన్, జాకీ ష్రాఫ్ తో చాలామంది బాలీవుడ్ ప్రముఖులతో ప్రభుదేవా కొత్త కొత్త స్టెప్పులు వేయించారు. టాలీవుడ్ లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో పాటు చాలామంది హీరోలతో కొత్త కొత్త స్టెప్పులు వేయించారు. అంతేకాదు, తెలుగులో కూడా కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ప్రభుదేవా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’. సిద్దార్థ్​, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి ఏకంగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులు దక్కాయి.
మైలు రాళ్లు
ప్రభుదేవా కెరీర్​ ఆరంభం నుంచీ చాలా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. వాటిలో కొన్ని ఇప్పటికీ ప్రత్యేకమే. వాటిలో ఒకటి ‘ముక్కాబులా ముక్కాబులా’ పాట. ఈ పాటను బాలీవుడ్​లోనూ రీమేక్​ చేశారు. అక్కడా సూపర్​ హిట్​గా నిలిచింది. ప్రభుదేవా ఇప్పటివరకు ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ గా రెండు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీటితో పాటు చాలా అవార్డులను అందుకున్నారు. సినిమా రంగంలో ప్రభుదేవా చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. గత ఏడాది ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుదేవా ఈ అవార్డును అందుకున్నారు.