Salaar: వారికి నష్టం.. డబ్బు తిరిగిచ్చేసిన నిర్మాతలు..!
Salaar: రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. దాదాపు రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈ సినిమా సక్సెస్ అయింది. అయితే సలార్ నిర్మాతలు… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగిచ్చేసారట. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సలార్ వల్ల నష్టపోయారట. అనుకున్నంత లాభాలు రాకపోవడంతో వారికి నష్టాలు వచ్చాయట. అందుకే నిర్మాతలు వారికి డబ్బులు తిరిగిచ్చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
నిజాం ప్రాంతంలో సలార్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను మైత్రి మూవీ మేకర్స్ కొనుగోలు చేసారు. వారికి బాగానే లాభాలు వచ్చాయి కానీ ఆంధ్రప్రదేశ్‌లోని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టపోయారట. ఇందుకు కారణం వారు లిమిట్కి మించి డబ్బులు పెట్టి హక్కులు కొనుగోలు చేయడమే అని తెలుస్తోంది. అయితే నష్టపోయినందుకు ఆ డిస్ట్రిబ్యూటర్లు బయటికి వచ్చి ఎలాంటి హంగామా చేయలేదు. వారి గురించి సలార్ నిర్మాణ సంస్థ అయిన హోంబలే ఫిలింస్ యజమాని విజయ్ కిర్గండూర్ స్వయంగా వారిని పిలిచి డబ్బులు చెల్లించారు.
మైత్రి మూవీ మేకర్స్ మాత్రం కాస్త ఆలోచించి రూ.60 కోట్లకు నిజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుగోలు చేసింది. కాబట్టి పెట్టిన దాని కంటే ఎక్కువ లాభాలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ కూడా 8.9 మిలియన్ డాలర్లతో బాగానే లాభపడ్డాడు.