Oscar RRR: ఆస్కార్‌ వేదికపై మరోసారి RRR.. ఎందుకలా?

Oscar RRR: 96వ ఆస్కార్ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరిగాయి. ఈ సారి అకాడమీ అవార్డుల్లో ‘ఓపెన్ హైమర్’ బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ సహా పలు విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది. అయితే ఈ వేడుకల్లో మన దేశం తరుపున ఆర్ఆర్ఆర్ మూవీ మరోసారి వేదికపై మెరిసింది.

టాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘RRR’. స్టార్‌ నటులు జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుంచి గతేడాది జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక అకాడమీ అవార్డుల వేడుకల్లో ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ వరించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్‌ వేడుకల్లో మరోసారి ఈ పాట మెరిసింది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 96వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దృశ్యాలు కనిపించాయి. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటరిగీలో అవార్డును ప్రకటించే సమయంలో తెరపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించారు.

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ వేసిన ‘నాటు నాటు’ హుక్ స్టెప్ విజువ‌ల్స్ క‌నిపించాయి. సాధార‌ణంగా ఏ అవార్డు ఇచ్చినా, నామినీల వివ‌రాల‌తో పాటుగా, గ‌తేడాది ఆ కేట‌గిరిలో అవార్డు పొందిన సినిమా తాలుకూ విజువ‌ల్స్ ప్లే చేయ‌డం ప‌రిపాటి. అలా ‘నాటు నాటు’ పాట‌ని మ‌రోసారి ఆస్కార్ వేదిక‌పై చూసుకొనే అవకాశం తెలుగు సినీ ప్రియులకు దక్కినట్లైంది.

అంతేకాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని కొన్ని సీన్స్‌ కూడా ఈ వేదికపై తళుక్కున మెరిశాయి. ఇప్పటి వరకూ సినిమాల్లో వచ్చిన బెస్ట్‌ స్టంట్స్‌కు సంబంధించిన సీన్స్‌ను ఓ ప్రత్యేక వీడియో ద్వారా ఈ వేదికపై ప్రదర్శించారు. అందులోనూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని రెండు యాక్షన్‌ షాట్స్‌ ఇందులో కనిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌ అవుతోంది.దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ లవర్స్ ప్రపంచం ఇంకా నాటు నాటు పాట ఫీవర్ నుంచి బయటకు రాలేకపోతుదనే కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఇయర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు ‘బార్బీ’ సినిమాలోని ‘వాట్ వాస్ ఐ మేడ్ ఫర్’ అనే సాంగ్‌కు వచ్చింది. ఈ సారి ఆస్కార్ బరిలో క్రిస్టఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఓపెన్‌హైమర్’ మూవీ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు సహా పలు విభాగాల్లో అవార్డులు గెలచుకొని సత్తా చాటింది.

ఆర్ఆర్ఆర్ మూవీ విషయానికొస్తే.. ఈ సినిమా 2021 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సత్తా చాటింది. ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విభాగంలో కీరవాణితో పాటు కొరియోగ్రఫీ, యాక్షన్ స్టంట్స్, బెస్ట్ పాపులర్ మూవీగా పలు విభాగాల్లో అవార్డుల అందుకుంది. ప్రస్తుతం రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మహేష్ బాబుతో ప్యాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్టు చెప్పాడు.