Prabhas Allu Arjun Fan War: అసలు మ్యాటర్ ఏంటి? తప్పు ఎవరిది?
Prabhas Allu Arjun Fan War: టాలీవుడ్లో ఫ్యాన్ వార్స్ కొత్తేమీ కావు. ఒకప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే అసభ్యకరమైన పదజాలంతో ధూషించుకునేవారు. ఇప్పుడు ఏకంగా అడ్రెస్లు కనుక్కుని మరీ ప్రాణాలతో చెలగాటం ఆడేస్తున్నారు. నిన్న కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం.
ఏం జరిగింది?
నిన్న బెంగళూరులో కొందరు యువకులు మరో అబ్బాయిని పట్టుకుని చావబాదారు. అతన్ని ఏకంగా చంపేసేంత గొడవ పడ్డారు. మ్యాటర్ ఏంటా అని చూస్తే.. వారిలో ఒకరు అల్లు అర్జున్ అభిమాని కాగా.. మరొకరు ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్ అయిన ఓ యువకుడు అల్లు అర్జున్‌ని ట్రోల్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేసాడు. ఆ వీడియో చూసిన అల్లు అర్జున్ అభిమాని మర్యాదగా డిలీట్ చేసి సారీ చెప్పు అన్నాడట. ఇందుకు ప్రభాస్ అభిమాని ఒప్పుకోలేదు.
దాంతో అడ్రెస్ పెట్టురా చూసుకుందాం అని సవాల్ విసురుకున్నారు. ప్రభాస్ అభిమాని అడ్రెస్ పెట్టడంతో అల్లు అర్జున్ అభిమాని మరికొందరు అబ్బాయిలతో కలిసి నడిరోడ్డుపై కొట్టుకున్నారు. ప్రభాస్ అభిమానిని ఒక్కడిని చేసి చావబాదారు. మర్యాదగా జై అల్లు అర్జున్ అంటావా అనవా అంటూ కన్నడలో కేకలు వేసాడు. పక్కనే ఉన్న మరో అబ్బాయి వాడు చచ్చేలా ఉన్నాడని భయపడి ఇంక చాలు ఆపరా అంటూ కన్నడ భాషలో కేకలు వేసాడు. అక్కడే కొన్న కొందరు వ్యక్తులు వెంటనే వీడియోని బెంగళూరు పోలీసులకు ట్విటర్లో ట్యాగ్ చేసారు. ప్రస్తుతం ఐదుగురు వ్యక్తులపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసారు. (Prabhas Allu Arjun Fan War)
గతంలో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
కొన్నేళ్ల క్రితం ఇలాగే ఇద్దరు చిన్న పిల్లలు తమ అభిమాన హీరోల కోసం కొట్టుకున్నారు. 2016లో ఈ ఘటన కర్ణాటకలోని కోలార్‌లో చోటుచేసుకుంది. ఆ సమయంలో అవయవ దాన కార్యక్రమాన్ని నిర్వహించగా.. వినోద్ రాయల్ అనే కుర్రాడు పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. ఆ సమయంలో వినోద్ రాయల్.. జై పవన్ కళ్యాణ్ అని అరుస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని తిరుపతిలోనూ ఏర్పాటుచేయండి అని కేకలు వేసాడు. దాంతో అక్కడే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని సునీల్‌కి ఒళ్లు మండంది.
దాంతో ఈ విషయంలో సునీల్, వినోద్‌కు మధ్య గొడవ జరుగుతుండగా.. సునీల్ స్నేహితుడు అక్షయ్ వినోద్‌ను పొడిచేసాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లినా కూడా వినోద్ ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్‌ను విషయం తెలిసి అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు.
2023లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
2023లోనూ ఇలాంటి ఫ్యాన్ వార్ జరిగింది. ఈ ఘటనలోనూ ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన ఏలూరులో చోటుచేసుకుంది. కిశోర్, హరి కుమార్ అనే ఇద్దరు స్నేహితులు పెయింటింగ్ వర్క్ కోసం ఏలూరు నుంచి అత్తిలి వెళ్లారు. పెయింటింగ్ పనులు ముగించుకుని పని చేస్తున్న బిల్డింగ్‌లోనే తాగుతూ కూర్చున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హరి కుమార్ ఫోన్లో పవన్ వాల్ పేపర్‌ను చూసి.. ప్రభాస్ ఫోటో పెట్టుకోవాలని కిశోర్ అన్నాడు. ఇందుకు హరి కుమార్ ఒప్పుకోలేదు. తాగిన మైకంలో ఇద్దరూ గొడవపడ్డాడు. కోపంలో మత్తులో ఉన్న కిశోర్.. అక్కడే ఉన్న పదునైన వస్తువుతో హరి కుమార్ తల పగలగొట్టాడు. దాంతో హరి కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఇంత జరుగుతున్నా కూడా సినీ నటులు ఎవ్వరూ కూడా ఇలాంటి ఫ్యాన్ వార్స్‌కి పాల్పడద్దు అని చెప్పడంలేదు. కనీసం వారు చెప్తే అయినా ఇలాంటి చిల్లర ఫైట్స్‌కి ఫుల్స్టాప్ పడే అవకాశం ఉంది.