NTR రికార్డు బ్రేక్​ చేసిన నాని!

శ్రీరామనవమి పండగ సందర్భంగా మార్చి 30న విడుదలలైన నాని ‘దసరా’ దేశవ్యాప్తంగానే కాదు ఓవర్సీస్​లోనూ దుమ్మురేపుతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్​లోనూ ధరణి వసూల్ రాజాగా మారిపోయాడు. భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్నాడు. మొదటి రెండు రోజుల్లోనే రూ.50 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ శని, ఆదివారాల్లో అంతకు మించి వసూలు చేయడం ఖాయం. విదేశాల్లోనూ దసరా హవా కొనసాగుతోంది. నాని రా అండ్​ రస్టిక్​ యాక్షన్​తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులు కూడా బ్రేక్​ చేశాడు. ఓవర్సీస్ కలెక్షన్లలో ‘దసరా’ మూవీ సక్సెస్‌తో ఈ రికార్డు సాధించాడు. కొన్నేళ్లుగా సరైన హిట్​లేని నాని దసరాతో ఆ లోటు తీర్చేశాడు.

విదేశాల్లో ఇప్పటికే ఏడుసార్లు వన్ మిలియన్ డాలర్ల వసూలు మార్క్ సాధించిన నాని దసరాతో ఆ సంఖ్యను 8 కి పెంచేశాడు. ఇప్పటికే నాని నటించిన ‘ఈగ’, ‘నేను లోకల్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘ఎంసీఏ’, ‘నిన్ను కోరి’, ‘జెర్సీ’, ‘అంటే సుందరానికీ!’ చిత్రాలు 1 మిలియన్ మార్క్ దాటాయి. తాజాగా దసరా కూడా వాటి సరసన చేరడంతో తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆ రికార్డు అందుకున్న రెండో హీరోగా నిలిచాడు మన ధరణి. ఇక, సూపర్​స్టార్​ మహేష్​ బాబు 11 సినిమాలతో మొదటి స్థానంలో ఉన్నాడు.

ఇంతవరుకు 7 చిత్రాలతో ఎన్టీఆర్‌తో సమానంగా ఉన్న నాని దసరాతో తారక్​ను దాటేశాడు. ‘జెర్సీ’ తర్వాత విడుదలైన నాని సినిమాలు ‘గ్యాంగ్ లీడర్’, ‘వి’, ‘టక్ జగదీశ్, ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికీ’ ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ‘శ్యామ్​ సింగ రాయ్’ సినిమా పరంగా మంచి పేరు దక్కించుకున్నా కమర్షియల్​గా నానికి ప్లస్​ అవ్వలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా విదేశాల్లోని తెలుగువాళ్లను మెప్పిస్తున్న నాని పాన్ ఇండియా మూవీగా వచ్చిన దసరాతో మరో ఘనత సాధించాడు. శ్రీకాంత్​ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్​కి పరిచయమయ్యారు. ధరణికి జోడీగా వెన్నల పాత్రలో కీర్తీ సురేష్ నటించింది. ఎలాంటి బ్యాగ్రౌండ్​ లేకుండా పరిశ్రమకు వచ్చి స్టార్​ హీరో అయిన నాని ఓవర్సీస్​లోనూ రికార్డులు సృష్టించడంతో తెగ సంబరపడిపోతున్నారు అభిమానులు.