Spiritual: ఎలాంటి పూజలు చేస్తే సమస్యలు రావు?
Spiritual: అసలు కష్టమే రాకుండా జీవితం సజావుగా సాఫీగా సాగేలా చేసే పూజలు ఉంటాయా? ఉంటాయనే చెప్తున్నారు నిపుణులు. అవేం పూజలో ఎలా చేయాలో తెలుసుకుందాం.
మనం సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి.. ముందుగా అందరికీ ఉండే డబ్బు సమస్యల గురించి కాకుండా అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకుందాం. రోజూ పౌష్ఠికరమైన ఆహారం తింటూ వ్యాయామం చేస్తుంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు అనేది మనకు తెలిసిన విషయమే. ఒకవేళ అనారోగ్య సమస్య వచ్చినా మందులు వేసుకుంటూ ఉంటాం. అలా ఆ అనారోగ్యం నుంచి కోలుకోగలుగుతాం. పూజ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. మనకు ఏదన్నా సమస్య వస్తే దేవుడా.. అనుకుంటూ ఎక్కడిలేని భక్తి వచ్చేస్తుంది. ఏడాదిలో ఒకసారి కూడా ఆలయానికి వెళ్లనివారు.. ఏదన్నా సమస్య వస్తే ప్రతి రోజూ ప్రతి వారం వెళ్లేవారు కూడా ఉంటారు. అలా కాకుండా.. ఒక ఆధ్యాత్మికత ప్రక్రియను ఫాలో అవుతూ ఉండాలి. ధర్మ మార్గంలో నడుస్తూ ఈ ప్రక్రియను ఫాలో అయితే సమస్యలు దరిచేరవు అని పెద్దలు చెప్తుంటారు. ధర్మ మార్గంలో నడవకుండా ఎన్ని హోమాలు, పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదు. (Spiritual)
మరి ఏ రోజున ఎలాంటి పూజలు చేస్తే మంచిది?
*ఆదివారం నాడు ఆదిత్య హృదయం పఠిస్తూ సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఎంతో మంచిది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రధాత. ఆదిత్య హృదయం అనేది అందరికీ వచ్చి తీరాల్సిన ప్రాథమిక శ్లోకం.
*సోమవారం నాడు శివయ్యకు రుద్రాభిషేకం చేస్తే కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటే రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటారు. కానీ రుద్రాభిషేకం చేయాలంటే రుద్రం, వేదం నేర్చుకోవాలి అంటారు. మీకు చేతకాకపోతే.. తెలిసిన గురువులను సంప్రదించండి.
*మంగళవారం చాలా మంది ఆంజనేయ ఉపాసం చేస్తారు. ఇది చాలా శక్తిమంతమైనది.
*బుధవారం నాడు సింధూర గణపతిని పూజిస్తే మంచిది. సింధూర గణపతి ఫోటో తప్పనిసరిగా ఉండాలి. లేదా వినాయకుడి విగ్రహం, లేదా ఫోటోకి సింధూరం రాసి ఈ పూజ చేయాల్సి ఉంటుంది. మహా విష్ణువు పూజ చేసినా మంచి ఫలితం ఉంటుంది.
*ఇక గురువారం సామాన్యంగా గురువుని పూజించుకుంటారు. దత్తాత్రేయ స్వామి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. లేదా మీ గురువుని పూజించినా మంచిదే. ఇలా చేస్తే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. (Spiritual)
*శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేస్తే ఇల్లంతా సంపదలతో కళకళలాడతాయట. ఇది స్కాంద పురాణంలో దారిద్రన మోచన స్తోత్రం ఉంది. ఇది కేవలం అష్టోత్తరం అనుకుంటారు కానీ చాలా శక్తిమంతమైనది. శ్రద్ధగా 40 రోజులు చేస్తే కలిగే ఫలితాలు మీకే తెలుస్తాయి.
*శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేస్తే ఎంతో మంచిది. వజ్ర కవచ స్తోత్రం చదివితే చాలా ఫలితం ఉంటుంది.
పూజా మందిరం ఎలా ఉండాలి?
వారం రోజుల పాటు ఏడుగురు దేవతలని పూజించుకోవాలని అనుకుంటే ముందు మీ పూజా గదిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలిసి ఉండాలి. మీ ఇంటి ఇలవేల్పు కానీ మీ ఇష్ట దైవాన్ని కానీ పూజా మందిరంలో మధ్యలో పెట్టుకోండి. ఉదాహరణకు మీకు రాముడంటే ఇష్టమనుకోండి.. రాముడు సీత కలిసి ఉన్న ఫోటోని పెట్టుకోండి. నాకు రాముడంటేనే ఇష్టం ఆయన మాత్రమే ఉండే ఫోటో పెట్టుకుంటాను అని పొరపాటున కూడా అనుకోకూడదు. ఎప్పుడైనా సరే.. అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజిస్తేనే ఆ పూజకు ఫలితం ఉంటుందని పెద్దల మాట. మీ ఇష్ట దైవం చుట్టూ మిగిలిన దేవుళ్ల పటాలు పెట్టుకుని చక్కగా పూజించుకోండి.